కమీషన్ల కోసమే కట్టిన్రు

కమీషన్ల కోసమే కట్టిన్రు
  • బీఆర్​ఎస్​ ప్రభుత్వం డబ్బులన్నీ వేస్ట్​ చేసింది: మంత్రి ఉత్తమ్​
  • సమగ్ర విచారణకు ఆదేశిస్తామని వెల్లడి
  • బీఆర్ఎస్​ హయాంలోనే ప్రాజెక్టుల్లో అవినీతి అని మండిపాటు
  • మండలి చైర్మన్​ గుత్తా, మంత్రి తుమ్మలతో కలిసి రిటైనింగ్​ వాల్ పరిశీలన

నల్గొండ, వెలుగు: గత బీఆర్ఎస్​ ప్రభుత్వం కమీషన్ల కోసమే సుంకిశాల ప్రాజెక్టును చేపట్టిందని ఇరిగేషన్​శాఖ మంత్రి  ఉత్తమ్​కుమార్​ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు డిజైన్​లేదా నిర్మాణ లోపం వల్లే కూలిపోయిందన్నారు. దాని పైన సమగ్ర విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. ఇరిగేషన్​ డిపార్ట్మెంట్​తో సుంకిశాలకు సంబంధం లేదని, జీహెచ్​ఎంసీ పరిధిలో పనులు జరుగుతున్నాయని, దీని పైన ప్రభుత్వం సమీక్ష కూడా చేసిందన్నారు.

 నష్టం  ఎంతయినా కాంట్రాక్టు సంస్థ భరించి నిర్మాణం పూర్తి చేస్తుందని మంత్రి  తెలిపారు. ఈ ఘటనపై  ప్రతిపక్ష పార్టీ లు చేస్తున్న ఆరోపణలో నిజం లేదన్నారు. శుక్రవారం సుంకిశాల వద్ద కూలిపోయిన రిటైనింగ్​ వాల్​ను మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా ఇన్​చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి ఉత్తమ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

 బీఆర్ఎస్​ హయాంలోనే ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేగాక, పదేండ్ల పాలనలో దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చారని ఆరోపించారు. ఎస్​ఎల్​బీసీ టన్నెల్​ కంప్లీట్​ చేసినట్లయితే ఈరోజు సుంకిశాల అవసరం ఉండేది కాదన్నారు. 2014 నుంచి  ఎ స్​ఎల్​బీసీని పట్టించుకోకుండా అసెంబ్లీ ఎన్నికల ముందు 2022 లో సుంకిశాల చేపట్టడం వెనక రాజకీయ కోణం ఉందన్నారు. సీఎం రేవంత్​ పక్షాన ఇరిగేషన్​ మంత్రిగా తాను స్పష్టమైన హామీ ఇస్తున్నానని.. ఎస్ఎల్​బీసీ, డిండి ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా కంప్లీట్​చేస్తామన్నారు. 

ముగ్గురిలో ఎవరి మానస పుత్రిక?: మండలి చైర్మన్ గుత్తా 

సుంకిశాల ప్రాజెక్టు కేసీఆర్, కేటీఆర్, కాంట్రాక్టు సంస్థ ఈ ముగ్గురిలో ఎవరి మానస పుత్రికో తెల్వదని మండలి చైర్మన్​గుత్తా సుఖేందర్​ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టును ఎందుకు చేపట్టారనేది ఆ ముగ్గురికి తప్ప మూడో మనిషికి తెల్వదన్నారు. ‘‘2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 2022 వరకు సుంకిశాల ఊసెత్తలేదు. 1994 లో తెరపైకి వచ్చిన ఈ ప్రాజెక్టు అవసరం లేదని పక్కన పెట్టారు. 

మరి ఎందుకో తెల్వదు గానీ.. కేసీఆర్, కేటీఆర్ కు​మధ్యరాత్రి కల వచ్చిందో ఏమో వెంటనే టెండర్లు పిలవడం, చకచకా జరిగిపోయింది’ అని సుఖేందర్​రెడ్డి ఎద్దేవా చేశారు. ఎస్​ఎల్బీసీ, ఏకేబీఆర్​ ఉండగా, రూ.1400 కోట్లు ఖర్చు పెట్టి సుంకిశాల వద్దని చెప్పినా పట్టించుకోలేదన్నారు.  ఈ రెండేళ్లలో అంచనా వ్యయం రూ.2,200 కోట్లు పెరిగిందని,  పూర్తయ్యే నాటికి మూడు, నాలుగు వేల కోట్లకు పోయినా ఆశ్చర్యపడా ల్సిన అవసరం లేదన్నారు.  

నీళ్లు ఇవ్వాలనే తాపత్రయంతో తప్పు జరిగింది: తుమ్మల నాగేశ్వర రావు

సుంకిశాల నుంచి త్వరగా నీళ్లు ఇవ్వాలనే తాపత్రయంతో అధికారులు చేసిన తప్పులా ఇది కనిపిస్తోందని మంత్రి తు మ్మల నాగేశ్వరరావు అన్నారు. ‘ఘటన గురించి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకరాలేదని తెలుస్తోంది. మీడియా ద్వారా బయటకు రావడంతోనే ప్రభుత్వం అప్రమత్తమైంది. సుంకిశాల అవసరం లేదనే తాను ఇరిగేషన్​ మినిస్టర్​గా ఉన్నప్పుడు ఎస్​ఎల్​బీసీ లిఫ్ట్​ స్కీంను చేపట్టడం జరిగింది. 

ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కంప్లీట్​ చేశాకే అప్పుడు ఎన్నికలకు పోయాం. సాగర్​ లో వాటర్​ లెవల్స్ పడిపోయినా, తాత్కాలిక మోటార్లు పెట్టి నడిపించే విధంగా ఎస్​ఎల్​బీసీ చేపట్టాం. సుంకిశాల మీద డీ టైయిల్డ్ రిపోర్ట్​ ఇవ్వమని జలమండలిని ఆదేశించాం. అది వచ్చాకే పనులు మొదలవుతాయి”అని తుమ్మల పేర్కొన్నారు.

ప్రాజెక్టులకు నష్టం జరగకుండా పూడికతీత

రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నష్టం జరగకుండా ఉండేలా పూడికతీతను చేపట్టాలని, ప్రాజెక్టుల రక్షణపై రాజీ పడొద్దని అధికారులను మంత్రి ఉత్తమ్​ ఆదేశించారు. ప్రాజెక్టుల్లోంచి తీసిన పూడిక సారవంతమైనదయితే రైతులకు ఫ్రీగా ఇవ్వాలని సూచించారు. ట్రాన్స్​పోర్ట్​ చార్జీలు రైతులు భరించి పూడిక మట్టిని తీసుకెళ్లేలా చూడాలన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్​లో సెడిమెంట్​ మేనేజ్​మెంట్​పై ఏర్పాటు చేసిన కేబినెట్​ సబ్​ కమిటీ మీటింగ్​ను నిర్వహించారు. 

మంత్రులు ఉత్తమ్​, తుమ్మల నాగేశ్వర్​ రావు, జూపల్లి కృష్ణా రావు, ఇరిగేషన్​ సెక్రటరీ, అధికారులు పాల్గొన్నారు. కేంద్రం అనుమతులకు అనుగుణంగానే పూడికతీత పనులను చేపట్టాలని అధికారులకు మంత్రులు సూచించారు. పూడికతీతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. పూడికతీతపై ఇరిగేషన్​, మైన్స్​ అండ్​ జియాలజీ విభాగాలు సమావేశమై ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. 

పూడికతీత ద్వారా వచ్చిన ఇసుక, మట్టిని ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించాలన్నారు. ఇసుకను ప్రాజెక్టుల ఇతర నిర్మాణాలకు వినియోగించాలని, మట్టిని ఎప్పటికప్పుడు ఖాళీ చేయాలని సూచించారు. ఈ నెల 14 నాటికి సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పూడికతీతతో ప్రాజెక్టులను రీస్టోర్​ చేసి.. నీటి నిల్వలను పెంచుకోవచ్చన్నారు. ఇప్పటికే పూడికతీతపై ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని పేర్కొన్నారు.