కాకా ఓ బ్రాండ్.. అంబేడ్కర్ ఆశయ సాధనకు ఎంతో చేసిండు

కాకా ఓ బ్రాండ్.. అంబేడ్కర్ ఆశయ సాధనకు ఎంతో చేసిండు

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి (కాకా) 92వ జయంతి సందర్భంగా ఆయనను అందరూ గుర్తు చేసుకున్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తి తో కాకా అనేక పోరాటాలు చేశారని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు.  అంబేడ్కర్‌‌ను ఆదర్శంగా తీసుకుని కాకా ఉద్యమం చేశారన్నారు. రేషన్ షాప్ వ్యవస్థను తీసుకొచ్చింది కాకానే అని.. రాష్ట్రంలో అన్నపూర్ణ క్యాంటీన్ వ్యవస్థను కూడా ఆయనే తీసుకొచ్చారని గుర్తు చేశారు. 

‘అంబేడ్కర్ ఆశయ సాధనకు నాన్న ఎంతో కృషి చేశారు. పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వాలని ఎప్పుడూ పరితపించే వారు.  టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఆపదలో ఉన్నప్పుడు రూ.125 కోట్లు ఇప్పించి ఆదుకున్నారు. పెన్షన్ స్కీంను తీసుకొచ్చింది కాకానే. ప్రయివేటు వ్యవస్థలో కూడా పెన్షన్ స్కీమ్‌ను తెచ్చారు. పేదలకు విద్యను అందివ్వడం కోసం అంబేడ్కర్ విద్యా సంస్థను ప్రారంభించాం. ఈ సంస్ధల ద్వారా 2 లక్షల మందికి చదువు చెప్పించాం’ అని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. 

వివేక్‌ను చూస్తే కాకాను చూసినట్టే అనిపిస్తది 

‘ఈ రోజు కాకా  లేకపోయినా ఆయన జన్మ ధన్యం అయ్యింది. ఈ అదృష్టం కొందరికే దక్కుతుంది. తెలంగాణ రావాలని కలలు గని అవి నిజం చేసుకున్నారు. ఆయన మన మధ్య లేకున్నా ఆయన నేర్పిన పాఠాలు మనకు ఉపయోగపడుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో మాకు ఎన్నో నేర్పించారు. దిక్సూచిగా నిలిచారు. వివేక్ చాలా డిసిప్లెయిన్.  ఆయనను చూస్తే మాకు చాలా నేర్చుకోవాలని అనిపిస్తుంది. వాళ్ల నాన్న కాకా నేర్పించిన డిసిప్లెయిన్ అది. వివేక్‌‌ను చూస్తే కాకాను చూసినట్లే అనిపిస్తుంది. ఎంతో మంది త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణ.. ఎవరి కోసం అన్న ఆలోచన ప్రజల్లో మొదలైంది. అమలు కాని హామీలు ఇచ్చి.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఈ పాలకుల వ్యవహరం పై ప్రజలు ఆలోచన చేయాలి. కాకా, కొండా లక్ష్మణ్ బాపూజీ అందరూ తెలంగాణ రావాలి అనుకున్నారు. కానీ ఇలాంటి తెలంగాణ కాదు’ అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 

అన్నేళ్ల రాజకీయ జీవితం ఆషామాషీ కాదు

‘ఎంత కృషి చేస్తే  40 ఏండ్ల  కాకా రాజకీయ జీవితం నిలబడింది. దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు. కాకా బతికి ఉంటే దళితుడ్ని సీఎం చేసే వరకు పోరాటం చేసేవారు. అంబేడ్కర్‌‌ను చూడలేక పోయాను కానీ కాకాను చూశాను. కేసీఆర్ అందరికీ భర్త అని చెప్పే స్థాయికి టీఆర్ఎస్ నాయకులు దిగజారారు. దళితుడ్ని సీఎం చేసే వరకు మనం పోరాటం చేయాలి’ అని బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బాషా చెప్పారు.   

చరిత్రలో నిలిచిపోయేలా పని చేసిండు

‘చరిత్రలో నిలిచి పోయే పనులు కాకా చాలా చేశారు.  ఆయన చదువుకోకపోయినా అంబేడ్కర్ కళాశాలలు పెట్టి పేద పిల్లలకు చదువు చెప్పించారు. కాకా అనే పేరు ఒక  బ్రాండ్. హైదరాబాద్‌‌లో  పేదలకు గుడిసెలు వేయించింది కాకానే’ అని మాజీ మంత్రి శంకర్ రావు చెప్పారు. కాకా కులాలకు అతీతంగా పేదల కోసం పని చేశారని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు అన్నారు. పేదలకు ఇండ్లు ఉండాలనేది కాకా ఫిలాసఫీ అని.. అందుకు ఆయన విశేషంగా కృషి చేశారన్నారు.  

మరిన్ని వార్తల కోసం: 

మోడీజీ.. ఆ మంత్రి కుమారుడ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? : ప్రియాంకా గాంధీ

కరోనా డెత్ కాదని సాకులు చెప్పొద్దు : సుప్రీం

డిసెంబర్‌ లో ప్రొ కబడ్డీ లీగ్‌!

మీ ఆదరణతో మూడేండ్ల ‘వెలుగు’