బడుల్లో కట్టెల పొయ్యిలొద్దు!

బడుల్లో కట్టెల పొయ్యిలొద్దు!
  •     పొగతో పిల్లల ఆరోగ్యంపై ఎఫెక్ట్
  •     మిడ్‌‌‌‌ డే మీల్స్‌‌‌‌కు ఎల్​పీజీ కనెక్షన్లు ఇవ్వాలి
  •     రాష్ట్రంలో ఆరేండ్లలో 12% బడుల్లోనే న్యూట్రిషన్ గార్డెన్స్
  •     కేంద్ర బృందం రిపోర్టులో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మెజార్టీ సర్కారు బడుల్లో పిల్లలకు అందించే మిడ్‌‌‌‌‌‌‌‌ డే మీల్స్‌‌‌‌‌‌‌‌ను కట్టెల పొయ్యిపైనే వండుతున్నారు. దీంతో పొగ ప్రభావం పిల్లల ఆరోగ్యంపై పడుతున్నది. ఇదే విషయంపై నేషనల్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), ఇతర ప్రతినిధుల బృందం గతంలో రాష్ట్రంలోని ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జాయింట్ రివ్యూ మిషన్ (జేఆర్​ఎం) నిర్వహించి రిపోర్టును రిలీజ్ చేసింది. కట్టెలపొయ్యిపై వంట చేయడంతో స్కూల్ ఆవరణతో పాటు, వంట రూమ్స్ పొగతో నిండిపోతున్నాయని అందులో పేర్కొంది. పొగ వల్ల స్టూడెంట్లకు ఇబ్బంది కలుగుతున్నదని, రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా అన్ని బడులకు ఎల్​పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాలని సూచించింది.

కిచెన్ గార్డెన్లపై నిర్లక్ష్యం

స్కూల్ ఆవరణలో న్యూట్రిషన్ గార్డెన్ల ఏర్పాటుపై కేంద్ర విద్యా శాఖ పీఏబీ పీఎం పోషణ్​ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. కానీ, గత రాష్ట్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. ఆరేండ్లలో కేవలం 12% బడుల్లోనే వాటిని ఏర్పాటు చేసింది. దీనిపై కేంద్ర విద్యాశాఖ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. బడుల ఆవరణలో వీటి ఏర్పాటు ద్వారా తాజాగా పండించిన కూరగాయలు, ఆకు కూరలతో పిల్లలకు వండిపెట్టవచ్చని పేర్కొన్నది. 2017–18 విద్యాసంవత్సరంలో మొత్తం 27,896 బడుల్లో కేవలం 1,203 స్కూళ్లలోనే న్యూట్రిషన్ గార్డెన్లను ఏర్పాటు చేశారు. 2022–23 సంవత్సరంలో 27,202 స్కూళ్లకు గానూ 3,350 (12%) బడుల్లోనే ఇవి ఉన్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. 

కేంద్రం నిధులిచ్చినా వంటగది సామాను కొనలే

మిడ్‌‌‌‌‌‌‌‌ డే మీల్స్‌‌‌‌‌‌‌‌ వండేందుకు అవసరమైన వంటగది పరికరాల కోసం కేంద్రం నిధులిచ్చినా గత ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. రెండున్నర ఏండ్లుగా పట్టించుకోలేదు. చాలా బడుల్లో అవసరమైన పరికరాలు లేవని జేఆర్ఎం రిపోర్టులో పేర్కొన్నారు.