
రాష్ట్రంలో డిగ్రీ, ఇంజినీరింగ్ సెమిస్టర్స్ ఎగ్జామ్స్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉన్నత విద్యామండలిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరీక్షలు నిర్వహించటం లేదా రద్దు చేయటం వల్ల ఎలాంటి పరిస్థితి ఉంటుందన్నది చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించకపోవడమే బెటర్ అని మెజార్టీ అభిప్రాయం వచ్చినట్టు తెలిసింది. పలు రాష్ర్టాలు పరీక్షల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే విషయాన్ని పరిశీలించి, అందరి అభిప్రాయాలనూ సీఎం కేసీఆర్‌కు పంపించాలని నిర్ణయించారు. శుక్రవారం మంత్రి సబితారెడ్డి ద్వారా సీఎం కేసీఆర్‌కు నివేదిక పంపించనున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చిత్రారాంచంద్రన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి , వైస్ చైర్మెన్లు లింబాద్రి, వెంకటరమణ, ఓయూ ఇన్చార్జీ వీసీ అరవింద్ కుమార్, కేయూ ఇన్చార్జీ వీసీ జనార్థన్‌రెడ్డి, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, వివిధ యూనివర్సిటీల అధికారులు పాల్గొన్నారు.