
- ఆకాంక్ష హాట్ ప్రారంభోత్సవంలో కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే బొజ్జు
నిర్మల్, వెలుగు: మహిళల ఆలోచనలను వెలుగులోకి తెచ్చేందుకు మహిళా సంఘాలు తోడ్పాటునిస్తాయని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం సాయంత్రం నిర్మల్లోని అంబేద్కర్ భవనంలో ఆకాంక్ష హాట్ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అక్కడ ప్రదర్శించిన వస్తువులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. నీతి అయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ సదస్సులో పెంబి మండలంలో చేపట్టిన కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా 4వ ర్యాంకు రావడం గర్వకారణమన్నారు.
త్వరలోనే గవర్నర్ చేతుల మీదుగా జిల్లా అధికా రులు కాంస్య పతకాలు అందుకోనున్నట్లు తెలిపారు. మండలంలో గర్భిణుల నమోదు, డయాబెటిస్ స్క్రీనింగ్, సప్లిమెంటరీ న్యూట్రీషియన్లో వందశాతం పూర్తిచేశామని, భూ హెల్త్ కార్డుల జారీలో 70 శాతం, మహిళా సంఘాలకు రుణాల్లో 94 శాతం పరిపూర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.
మహిళా సంఘాలు ప్రభుత్వం అందించే రుణాలు సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమం ఆగస్టు 4 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, స్కిట్స్ఆకట్టుకున్నాయి. అంతకుముందు మొక్కలు నాటారు. అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, అధికారులు, సిబ్బంది, మహిళా స్వయం సంఘాల సభ్యులు పాల్గొన్నారు.