సింగరేణిలో 150 మంది ఈపీ ఆపరేటర్లకు ప్రమోషన్లు

సింగరేణిలో 150 మంది ఈపీ ఆపరేటర్లకు ప్రమోషన్లు

ఉత్తర్వులు జారీ చేసిన యాజమాన్యం

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కోల్ మైన్స్‌‌‌‌ ఓపెన్ కాస్ట్ గనుల్లో అర్హత గల ఈపీ ఆపరేటర్లకు త్వరలో పదోన్నతులు లభించనున్నాయి. ఎక్స్కవేషన్ లో కేటగిరీ– డికి చెందిన వారికి కేటగిరీ– -సికి, కేటగిరీ– సికి చెందినవారికి కేటగిరీ-– బికి ప్రమోషన్లు ఇవ్వాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో సుమారు 150 మంది ఆపరేటర్లు ప్రయోజనం పొందనున్నారు. ఖాళీలతో సంబంధం లేకుండా ఈ ప్రమోషన్లు కల్పించాలని నిర్ణయించారు. సంస్థ సీఎండీ బలరాం ఆదేశాల మేరకు యాజమాన్యం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఎక్స్కవేషన్ కేటగిరీ–-డిలో రెండేండ్లు సర్వీస్ పూర్తి చేసిన ఆపరేటర్లకు కేటగిరీ-–సికి పదోన్నతి, కేటగిరీ–సిలో మూడేండ్ల సర్వీస్ పూర్తి చేసినవారికి కేటగిరీ-–బికి పదోన్నతి కల్పించనున్నారు. అయితే, పదోన్నతి పొందాలనుకునేవారు ప్రాక్టీకల్ పరీక్షలు, అసెస్ మెంట్ నివేదికల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. మార్చి 2025 లేదా సెప్టెంబర్ 2025 నాటికి సర్వీస్ పూర్తి చేసిన అందరికీ ఈ ప్రమోషన్లు వర్తిస్తాయి. ఇటీవల జరిగిన 38వ సీఎండీ స్థాయి, 50వ డైరెక్టర్ (పర్సనల్ అడ్మినిస్ట్రేషన్) స్థాయి  సమావేశాల్లో గుర్తింపు కార్మిక సంఘం ప్రతిపాదనలపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈ ప్రమోషన్లను ఖాళీలు, పరీక్షలు, అసెస్ మెంట్ నివేదికలపై ఆధారపడి ఇచ్చేవారు. ఈ అంశంపై కమిటీని ఏర్పాటు చేసి, నివేదిక తర్వాత కంపెనీ నియమాలను అనుసరించి ఈ విధానం అమలు చేయడానికి అంగీకరించింది.