హైదరాబాద్‌‌లోకి ప్రాపర్టీ కేర్... విల్లాలు, ప్లాట్లు, భూముల రక్షణపై ఫోకస్..!

హైదరాబాద్‌‌లోకి ప్రాపర్టీ కేర్... విల్లాలు, ప్లాట్లు, భూముల రక్షణపై ఫోకస్..!
  • విల్లాలు, ప్లాట్లు,  ఇతర విలువైన భూములు సంరక్షించడమే విధి
  • ఇలాంటి సంస్థలు ఇప్పటికే విదేశాల్లో పాపులర్​
  • మన దేశంలోనూ ముంబై, బెంగళూరులో వర్క్​
  • హైదరాబాద్‌‌లోనూ ఎంట్రీ కోసం  కొన్ని సంస్థలు రిజిస్ట్రేషన్​  
  • దీపావళి నుంచి అందుబాటులోకి రానున్న సేవలు

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్​లో ప్రాపర్టీ కేర్​ సంస్థలు అడుగుపెట్టబోతున్నాయి. విల్లాలు, ప్లాట్లు, ఫ్లాట్లు, ఇతర ఖాళీ జాగాల సంరక్షించడమే వీటి విధి. ఇలాంటి సంస్థలు ఇప్పటికే విదేశాల్లో పాపులర్. మన దేశంలోనూ ముంబై, బెంగళూరులో వర్క్​చేస్తున్నాయి. హైదరాబాద్​లోనూ ఎంట్రీ కోసం  కొన్ని సంస్థలు ప్రభుత్వ అనుమతి తీసుకుంటున్నాయి. ​ దీపావళి నుంచి ప్రాపర్టీ కేర్​ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్​ మెట్రో సిటీ రోజు రోజుకు విస్తరిస్తున్నది. ఇక్కడ రియల్​ఎస్టేట్​ రంగం దినాదినాభివృద్ధి చెందుతున్నది. 

నేటి ఆర్థిక పరిస్థితుల రీత్యా జాబ్​, బిజినెస్​ చేసేవాళ్లు ఎల్లప్పుడూ ఒకే చోట ఉండలేకపోవచ్చు. ప్రపంచం అంతా తిరగాల్సిన పరిస్థితి. విదేశాలకు వెళ్లిన ప్రతి చోట ఇల్లు కట్టుకోవడమో.. ఖాళీగా జాగాలు కొనడమో చేయలేరు. ఒక చోట ఆస్తిని కలిగి ఉండి మరొక చోట పనిచేయడం వీరికి ఎల్లప్పుడూ సవాల్‌‌గా మారుతుంది. ఇల్లు అనేది ఒకే ఒక్కసారి జీవితకాల పెట్టుబడి. పది పదిహేనేళ్లు కష్టపడి సంపాదించిన డబ్బుతో  ఇల్లో, విల్లానో, ప్లాటో ఫ్లాటో కొనడమో చేస్తుంటారు. ఇలా ఆస్తులను కొనుగోలు చేయడం ఎంత ముఖ్యమో,  వాటిని కాపాడుకోవడం కూడా కూడా అంతే ఇంపార్టెంట్.  ఇలాంటి ప్రైవేట్ పాపర్టీ కాపాడమే ప్రాపర్టీ కేర్​ సంస్థల ప్రధాన విధి. 

ఎలాంటి సేవలు పొందవచ్చు

ప్రాపర్టీ కేర్ సంస్థల వల్ల ఆస్తికి దూరంగా ఉన్న ఓనర్లకు నమ్మకం పెరుగుతుంది. విల్లా, ఇల్లు లేదా ప్లాట్​, ఫ్లాట్ యజమాని ఎలాంటి ఆందోళన లేకుండా ప్రపంచంలో ఎక్కడైనా హాయిగా ఉండవచ్చు. తమకు బదులుగా ప్రాపర్టీ కేర్​ సంస్థలు తమ ఆస్తులను సంరక్షించే బాధ్యత తీసుకుంటాయి. ఖాళీ జాగాలైతే వారం లేదా పదిరోజులకోసారి స్వయంగా ఈ సంస్థ ప్రతినిధులు వెళ్లి పరిశీలీస్తారు. అక్కడి నుంచి ఓనర్లకు వీడియో కాల్స్​ చేసి ఆస్తులను చూపిస్తారు. ఖాళీ జాగాలను ఎవరికైనా రెంట్‌‌కు ఇవ్వాలన్నా చట్ట ప్రకారం చేసుకునే అగ్రిమెంట్లు అన్నీ కూడా వీళ్లే దగ్గరుండి పరిశీలిస్తారు. 

విల్లాలు, ఇండ్లను అద్దెకు ఇవ్వాలంటే ఓనర్ల తరఫున ఈ సంస్థలే అన్ని అగ్రిమెంట్లు చేస్తాయి. నెలనెలా అద్దె వసూలు చేసి ఓనర్లకు ఇస్తారు. ఇంట్లోని వస్తువులను శుభ్ర పరచడం, ఓనర్లు వచ్చే వరకు పూల మొక్కలు, గార్డెన్​ కాపాడడం, పెట్స్‌‌ను సంరక్షించడం లాంటి పనులు చేస్తారు. ఇంటికి అవసరమైన రిపేర్లు చేయిస్తారు. ప్రాపర్టీ కేర్​ సంస్థలు ప్రభుత్వ అనుమతులు తీసుకొని లీగల్‌‌గా పనిచేస్తాయి. ఈ సేవల కోసం ఓనర్ల నుంచి సర్వీస్​ చార్జీలను వసూలు చేస్తాయి. 

ముంబై, బెంగుళూరులో సక్సెస్‌‌ఫుల్‌‌గా సేవలు​ 

ప్రాపర్టీ కేర్ సంస్థల సేవలు విదేశాల్లో ఇప్పటికే  పాపులర్​ అయ్యాయి. అమెరికా, లండన్​, కెనడా, ఆస్ట్రేలియాలో ఈ విభాగంలో అనేక  ప్రాపర్టీ కేర్ సంస్థలు ఉన్నాయి. చాలా ఏండ్లుగా ఈ సంస్థల సేవలు కొనసాగుతున్నాయి. అమెరికాలో బ్రీజ్​వే, మైండ్​, లాఫ్టిమ్​, వెకాసలాంటి సంస్థలు ప్రాపర్టీ నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని (టెక్నాలజీని) ఉపయోగించి సమర్థవంతమైన సేవలు అందిస్తున్నాయి. 

మన దేశంలో ముంబై, బెంగుళూరులో ఇప్పటికే ప్రాపర్టీ కేర్​ సంస్థలు పనిచేస్తున్నాయి. బెంగుళూరులో ప్రాపర్టీ టెక్​ సొల్యూషన్స్​, ప్రాపర్టీ మార్షల్​, ముంబైలో గోద్రెజ్​ ప్రాపర్టీస్​, ఒబెరాయ్​ రియాల్టీ, నారాయణన్​ కార్ప్​, లోధా గ్రూప్​ తదితర సంస్థలు సేవలందిస్తున్నాయి. 

దీపావళి నుంచి హైదరాబాద్‌‌లో షురూ..

హైదరాబాద్‌‌కు చెందిన పలు సంస్థలు దీపావళి నుంచి ప్రాపర్టీ కేర్‌‌‌‌కు సంబంధించిన సేవలందించబోతున్నాయి. ఒకటి, రెండు సంస్థలు ఇప్పటికే ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు తీసుకొని లాంచింగ్‌‌కు  ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ప్రాపర్టీ కేర్‌‌‌‌కు సంబంధించిన సాఫ్ట్‌‌వేర్​, వెబ్​సైట్​ తయారీలో ఆ సంస్థలు నిమగ్నమయ్యాయి. 

ప్రాపర్టీ సంరక్షణకు సంబంధించి వసూలు చేసే ఫీజులు తదితర వివరాలన్నీ కూడా ఓనర్లకు తెలిసేలా వెబ్‌‌సైట్‌‌లో పొందుపరుస్తామని ఓ ప్రాపర్టీ కేర్​ సంస్థ ప్రతినిధి ‘వెలుగు’కు వివరించారు.  హైదరాబాద్​ సిటీ మొత్తం తమ సేవలను విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు.