
హైదరాబాద్ : జీహెచ్ ఎంసీలో రూ.15 వేల ఆస్తి పన్ను కట్టేవారికి 50 శాతం..ఇతర పట్టణాల్లో రూ.10 వేల ఆస్తి పన్ను కట్టేవారికి 50 శాతం రాయితీ ప్రకటిస్తున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. దీంతో జీహెచ్‌ఎంసీలో 13.72 లక్షలు.. మిగిలిన పట్టణాల్లో 17.68 లక్షలు.. రాష్ట్ర వ్యాప్తంగా 31.40 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 4,75,871 కుటుంబాలకు వరద సాయం రూ.10 వేల చొప్పున అందించామన్నారు.
ప్రజల పక్షాన నిలబడిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలని.. దీపావళి కానుకగా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. 2020లో కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తలకిందులయ్యిందన్న కేటీఆర్.. ప్రభుత్వ పరంగా చాలా కార్యక్రమాలు చేశామన్నారు. కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేసిందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మెచ్చుకొన్నారన్నారు మంత్రి కేటీఆర్.