టెక్కీలపై బాంబు పేల్చిన మైక్రోసాఫ్ట్.. ఆఫీసులకు రావాలంటూ రూల్స్ మార్పు..

టెక్కీలపై బాంబు పేల్చిన మైక్రోసాఫ్ట్.. ఆఫీసులకు రావాలంటూ రూల్స్ మార్పు..

అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన వర్క్ పాలసీలో కీలక మార్పులను ప్రకటించబోతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జనవరి 2026 నుంచి ఉద్యోగులు తప్పనిసరిగా వారానికి 3 రోజులు ఆఫీసు నుంచి పనిచేయటాన్ని అమలులోకి తీసుకురాబోతోంది. దీంతో ఆఫీసుకు 50 మైళ్లలోపు నివసిస్తున్న ఉద్యోగులు ప్రభావితం అవుతారని సమాచారం.

ఇదే సమయంలో మరికొన్ని టీమ్స్ లోని ఉద్యోగులు వారానికి 4 లేదా 5 రోజులు ఆఫీసుకు ఖచ్చితంగా రావాల్సి ఉంటుందని అయితే ఆ నిర్ణయం వారి పై అధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని సమాచారం. ఈ ఆఫీసు పాలసీ మార్పులకు సంబంధించిన ప్రకటన సెప్టెంబరులో వెల్లడికావొచ్చని తేలింది. అయితే మేనేజర్ అంగీకారం మేరకు టెక్కీలు మెుత్తం పని సమయంలో సగం వరకు అంటే వారంలో మూడు రోజులు ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించబడతారని తేలింది. దీనిపై పూర్తి స్పష్టత ఇప్పటి వరకు రాలేదు.

ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలైన గూగుల్, మెటా, అమెజాన్ లాంటి సంస్థలు ఇప్పటికే తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన సమయంలో మైక్రోసాఫ్ట్ కూడా అదే దారిని ఎంచుకుంది. ఈ ఏడాది టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహా అన్ని కంపెనీలు భారీగా లేఆఫ్స్ ప్రకటించటంతో ఉద్యోగులు మానసిక స్థైర్యం దెబ్బతిన్నందున కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందిగా కోరుతున్నాయి.

ALSO READ : FASTag ఏడాది పాస్‌కి భారీగా పెరిగిన డిమాండ్..

మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీసు పాలసీ ప్రకారం ఆఫీసుకు రావటానికి ఇష్టపడని ఉద్యోగులు కంపెనీ నుంచి వెళ్లిపోయేందుకు వీలు కల్పించొచ్చని తెలుస్తోంది. కంపెనీ వ్యూహాత్మకంగా ఈ తరహా లేఆఫ్స్ ప్రక్రియను ఫాలో అవుతుందని కొందరు టెక్కీలు ఆరోపిస్తున్నారు. మెుత్తానికి రానున్న రోజుల్లో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఇదొక పెద్ద సమస్యగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గూగుల్ తన ఆఫీసులను విస్తరించేందుకు భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ తక్కువ స్పేస్, పవర్ షార్టేజ్, తక్కువగా ఉన్న మీటింగ్ రూమ్స్ సమస్యలను సృష్టిస్తాయని తెలుస్తోంది.