కలవరపెడుతున్న  ఆస్తి పన్ను పెంపు

కలవరపెడుతున్న  ఆస్తి పన్ను పెంపు

సిద్దిపేట/చేర్యాల, వెలుగు :  చేర్యాల మున్సిపాలిటీలో ఆస్తి పన్ను పెంపు వివాదాలకు తెరలేపింది. మున్సిపాలిటీ ఆవిర్భావ సమయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సామాన్యుల పాలిట భారంగా మారింది. రిజిస్ట్రేషన్ విలువల ప్రకారం ప్రాపర్టీ  టాక్స్ లను పెంచడంతో వందల్లో కట్టిన వారికి వేలల్లో టాక్స్ రావడం వారిని కలవరపెడుతోంది. 2018లో చేర్యాల మున్సిపాలిటీగా ఏర్పడింది. దాదాపు 25వేల జనాభా ఉన్న మున్సిపాలిటీలో మొత్తం 5500 గృహాలు ఉండగా అందులో వెయ్యి వరకు వాణిజ్య గృహాలు 4500 నివాస గృహాలు ఉన్నాయి. దాదాపు రూ.50 లక్షల వరకు ఆస్తి పన్ను వసూలయ్యేది. మున్సిపాలిటీ ఆవిర్భావ సమయంలో అధికారులు ఆస్తి పన్నును ఒక్క శాతం పెంచాలని ప్రతిపాదనలు పంపారు. మార్కెట్ విలువల ఆధారంగా పాత  టాక్స్ లను కలిపి పెంచడం  ఇప్పుడు వివాదాలకు తెరలేపినట్టయింది. ఒక్క శాతం టాక్స్ పెంపు కోసం అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపగా అనుమతి వచ్చే సరికి రిజిస్ట్రేషన్ శాఖ రెండు మార్లు మార్కెట్ విలువలను పెంచింది. పన్ను శాతం తగ్గించినా ఆస్తి విలువల పెంపు వల్ల టాక్స్ లు విపరీతంగా పెరగడంతో ఇప్పుడు  గృహ యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా వుంటే ఆస్తి  పన్ను పెంపుతో ఏటా కోటి రూపాయల వరకు మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుండగా ఇప్పటి వరకు 80 లక్షల వరకు వసూలు కాగా పన్ను తగ్గించాలనే ఆందోళనతో ప్రస్తుతం చెల్లింపులు నిలిచిపోయాయి.

480 ఇండ్లకు టాక్స్ విధింపుతో వివాదం

చేర్యాల గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో 480 మంది ఇండ్ల నిర్మాణానికి అనుమతులు పొంది నిర్మాణాలు పూర్తి చేశారు. ఈ లోపు చేర్యాల మున్సిపాలిటీగా మారడంతో తమ ఇండ్లను రెగ్యులరైజ్ చేసి ఇంటి నంబర్లు ఇవ్వాలని వారంతా దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు 480 ఇండ్ల వివరాలను  నింపాదిగా ఆన్ లైన్ చేసి దాదాపు ఐదు సంవత్సరాల తరువాత పెంచిన ఆస్తి పన్ను చెల్లించాలని గృహ యజమానులకు చెప్పారు. ఈ లోపు మార్కెట్ విలువలు పెరగడంతో  అప్పటి వరకు వందల్లో ఆస్తి పన్ను చెల్లించిన వారికి వేలల్లో పన్ను విధించడం వారంతా గగ్గోలు పెట్టారు. దీంతో టాక్స్ పెంపును అధికారులు 0.25 శాతానికి తగ్గించినా వేల రూపాయల్లో టాక్స్ లు వచ్చాయి. ఈ విషయం గురించి మున్సిపల్ అధికారులను అడిగితే మున్సిపల్ నిబంధనల ప్రకారమే పన్నులు పెంచినా  మార్కెట్ విలువలు పెరగడం వల్ల టాక్స్ పెరిగిందని, ఇప్పటికే ఒక్కసారి  తగ్గించామని, మరోసారి  తగ్గించే అవకాశం లేదని స్పష్టం చేశారు. 

అవిశ్వాస రాజకీయాలతో పట్టని సమస్య

చేర్యాల మున్సిపాలిటీలో ఆస్తి పన్ను ఇబ్బడి ముబ్బడిగా పెరిగినా కౌన్సిలర్లు అవిశ్వాస రాజకీయాలతో పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది. చైర్మన్ ను పదవి నుంచి దించాలనే ఆలోచనతో ఉన్న  కౌన్సిలర్లు విందు, సమావేశాలు నిర్వహించుకుంటూ అసలు సమస్యను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు భారంగా మారిన ఆస్తి పన్ను తగ్గింపుపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాల్సిన కౌన్సిలర్లు ఇటీవల జరిగిన సమావేశానికి దూరంగా వుండటం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అవిశ్వాస రాజకీయాలు పక్కన పెట్టి పట్టణ ప్రజలకు భారంగా మారిన పన్నులను తగ్గించడం కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వానికి తీర్మానాన్ని పంపాలని డిమాండ్ చేస్తున్నారు.

పెంచిన టాక్స్ లు  కట్టలేక పోతున్నాం


చేర్యాల మున్సిపాల్టీలో  టాక్స్ లు విపరీతంగా పెంచడం వల్ల కట్టలేకపోతున్నాం.  గ్రామ పంచాయతీ గా ఉన్నప్పుడే ఇంటి పర్మిషన్ తీసుకుని నిర్మాణం పూర్తి చేసిన ఆరేండ్లకు ఇంటి నంబరు ఇచ్చి వేల రూపాయల టాక్స్ కట్టమంటున్నారు. బ్యాంకు లోన్ కోసం నేను పాత టాక్స్ లు పోను ఇప్పటికే రూ.38 వేల పన్నును కట్టాల్సి వచ్చింది. అధికారులు ఈ విషయంపై పునరాలోచన చేసి పెంచిన టాక్స్ లను తగ్గించాలి.  దీనికి పాలక వర్గం చొరవతీసుకోవాలి.  
– బద్దిపడగ  నర్సింహరెడ్డి, చేర్యాల

రూల్స్​ ప్రకారమే  ఆస్తి పన్ను విధింపు


మున్సిపల్ నిబంధనల ప్రకారమే చేర్యాల మున్సిపాలిటీలో ఆస్తి పన్నును విధించడం జరిగింది. గతంలో ఒక్క శాతం పెంచాలనే ప్రతిపాదనల వల్ల అధికంగా భారం పడుతుందని 0.25 శాతానికి తగ్గించి పన్నులు విధించాం. రిజిస్ట్రేషన్ శాఖ రెండు సార్లు మార్కెట్ విలువలను పెంచడం మూలంగా టాక్స్ లు పెరగడం వాస్తవమే. ఈ విషయంపై ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తున్నాం. త్వరలో మున్సిపల్ సమావేశాన్ని నిర్వహించి ఆస్తి పన్నును 0.10 శాతానికి తగ్గించాలని కౌన్సిల్  తీర్మానాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే చర్యలు తీసుకుంటాం.
– రాజేంద్ర కుమార్, మున్సిపల్ కమిషనర్