
- గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మార్కెట్ కమిటీల స్థాయి పెంపునకు ప్రతిపాదనలు
- మూడేళ్లుగా పెరిగిన మూడు కమిటీల ఆదాయం
- ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అప్గ్రేడ్
సిద్దిపేట, వెలుగు: జిల్లాలో గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మార్కెట్కమిటీల స్థాయిని పెంచడానికి అధికారులు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మూడేళ్లుగా ఈ మూడు మార్కెట్కమిటీలు గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఈ మార్కెట్లను ప్రభుత్వం అప్గ్రేడ్ చేస్తే స్పెషల్ గ్రేడ్ హోదా దక్కుతుంది. దీనివల్ల ఈ మూడు మార్కెట్ల రూపురేఖలు మారనున్నాయి. జిల్లాలో మొత్తం 14 మార్కెట్ కమిటీలుండగా వివిధ ఉత్పత్తులతో ఏటా దాదాపు రూ.35 కోట్ల ఆదాయన్ని ఆర్జిస్తున్నాయి. స్పెషల్ గ్రేడ్ హోదాలో సిద్దిపేట మార్కెట్ కమిటీ ఉన్నా కొన్నేళ్లుగా గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మార్కెట్ యార్డులు అధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. దీంతో వాటి స్థాయిని పెంచాలని అధికారులు భావించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
లక్ష్యాలను సాధిస్తున్న మార్కెట్ కమిటీలు
జిల్లాలోని గజ్వేల్, చేర్యాల మార్కెట్కమిటీలు గ్రేడ్ 1 లో ఉండగా హుస్నాబాద్ గ్రేడ్ 2 లో కొనసాగుతోంది. ఈ మూడు మార్కెట్లు అప్ గ్రేడ్అయితే వాటి స్వరూపం మారుతుంది. అప్ గ్రేడ్ వల్ల సౌకర్యాలతో పాటు సిబ్బంది సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల ఆయా మార్కెట్ల కు వచ్చే రైతులకు సేవలు మరింత వేగంగా అందుతాయి. జిల్లాలోని సిద్దిపేట, చేర్యాల, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, హుస్నాబాద్, బెజ్జంకి, చిన్నకోడూరు, నంగునూరు, దౌల్తాబాద్, కోహెడ మార్కెట్ కమిటీలతో పాటు జక్కాపూర్, కుకునూరుపల్లి, తోటపల్లి, బచ్చన్నపేటల్లో నాలుగు సబ్ మార్కెట్ యార్డులు పనిచేస్తున్నాయి.
జిల్లాలోని మెజార్టీ మార్కెట్ కమిటీలు కొన్నేళ్లుగా ఆదాయ లక్ష్యాలను సాధిస్తుంటే మూడు మార్కెట్ కమిటీలు లక్ష్యాల కంటే ఎక్కువగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. గత సంవత్సరంలో చేర్యాల, మిరుదొడ్డి, బెజ్జంకి మార్కెట్ కమిటీలు నిర్దేశిత లక్ష్యాల కంటే 20 శాతం అధికంగా ఆదాయాన్ని ఆర్జించాయి.
సెస్, ఫీజుల ద్వారా ఆదాయం
జిల్లాలో మొత్తం 63 గోదాముల్లో 1.59 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను ఏర్పాటు చేయగా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ మార్కెట్ యార్డుల్లో ఈ నామ్ (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) విధానాన్ని అమలు చేస్తున్నారు. రైతులు మార్కెట్ యార్డుకు తెచ్చిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే వ్యాపారులతో పాటు రైస్ మిల్లు, జిన్నింగ్ మిల్లులతో పాటు ఇతర ఏజెన్సీల నుంచి ఒక శాతం సెస్ ను వసూలు చేస్తారు.
పంట ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించేటప్పుడు చెక్ పోస్టులతో పాటు ఆయా యార్డుల్లో పంట క్రయవిక్రయాలపై ఫీజును వసూలు చేస్తూ మార్కెట్ కమిటీలు ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. జిల్లాలోని 13 మార్కెట్ కమిటీలు సంప్రదాయ పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరిపితే ములుగు మండలంలోని వంటి మామిడి మార్కెట్ యార్డులో కేవలం కూరగాయల విక్రయాలే జరుగుతుంటాయి.
ప్రతిపాదనలు పంపాం
చేర్యాల, గజ్వేల్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీలను స్పెషల్ గ్రేడ్ స్థాయి పెంపు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. కొన్నేళ్లుగా ఈ మూడు మార్కెట్లు ఆదాయ లక్ష్యాలను సాధిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఆయా మార్కెట్ కమిటీలను అప్ గ్రేడ్ చేస్తాం. దీనివల్ల మౌలిక సదుపాయాలు పెరగడమే కాకుండా రైతులకు వేగంగా సేవలందించవచ్చు.- నాగరాజు, జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్