సొసైటీ సేవలు మరింత చేరువ !..కామారెడ్డిలో మరో 10 సొసైటీలకు ప్రతిపాదనలు

సొసైటీ  సేవలు  మరింత చేరువ !..కామారెడ్డిలో మరో 10 సొసైటీలకు ప్రతిపాదనలు
  •     ఇప్పటికే జిల్లాలో 55 సొసైటీలు 
  •     జిల్లా కమిటీ ఆమోదం తర్వాత సర్కార్​ గ్రీన్​ సిగ్నల్
  •     తీరనున్న  రైతుల ఇబ్బందులు

కామారెడ్డి, వెలుగు : ప్రాథమిక సహకార సంఘాల సేవలు రైతులకు మరింత చేరువ కానున్నాయి.  ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో 55 సొసైటీలు ఉండగా, మరో 10 సొసైటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.   కొన్ని మండల కేంద్రాల్లో సొసైటీలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కమిటీ ఆమోదం తర్వాత ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కొత్త సొసైటీలు ప్రారంభమవుతాయి. దీంతో రైతులు తమ గ్రామాల దగ్గరలోనే ఎరువులు, విత్తనాలు, రుణాలు వంటి సేవలు పొందే అవకాశం ఉంటుంది.

10 సొసైటీలకు ప్రతిపాదనలు 

జిల్లాలో 25 మండలాలకు గాను 55 సొసైటీలు ఉన్నాయి. మరో 10 సొసైటీల ఏర్పాటుకు ప్రపోజల్స్ సిద్ధమయ్యాయి. కొన్ని మండలాల్లో నాలుగైదు సొసైటీలు ఉండగా, కొన్ని మండలాల్లో ఒక్క సొసైటీ కూడా లేదు. ఎరువులు, విత్తనాల కొనుగోలు, లోన్ల కోసం దూరం వెళ్లాల్సి వస్తోంది. వడ్ల కొనుగోలు బిల్లుల లెక్కల్లో తేడాలు వస్తే సొసైటీ లేక సమస్య ఏర్పడుతోంది. దీంతో పలుమార్లు కొత్త సొసైటీలు ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తులు చేశారు. గతంలో కొన్ని గ్రామాల్లో డిఫాల్టర్లు పెరగడం, నిర్వహణ భారాలు అధికమవ్వడం వల్ల కొన్ని సొసైటీలు రద్దయ్యాయి. 

తాజాగా గ్రామాల వారీగా డిమాండ్ ఉన్న ప్రాంతాల లిస్టును తయారు చేయాలని జిల్లా సహకార అధికారులకు ఉన్నతాధికారులు సూచించారు. ఈ లిస్టును కలెక్టర్‌ ఆధ్వర్యంలో అధికారులు ఆమోదించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుత సొసైటీల పాలకవర్గం గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించిన నేపథ్యంలో, సహకార సంఘాల ఎన్నికలకు ముందే కొత్త సంఘాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది.   

  •  రామారెడ్డి మండల కేంద్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ సొసైటీ లేదు. ఈ మండల పరిధిలోని గ్రామాలు సదాశివనగర్ మండలం అడ్లూర్-ఎల్లారెడ్డి, మాచారెడ్డి సొసైటీల పరిధిలో ఉన్నాయి. రైతులు ఎరువులు, విత్తనాలు, రుణాల కోసం వేరే మండలాలకు వెళ్లాల్సి వస్తోంది. 
  •  కామారెడ్డి మండలంలో గతంలో నాలుగు సొసైటీలు ఉండగా, మూడు మూసివేశారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఒక్కటే ఉంది. గతంలో రద్దైన గర్గుల్, చిన్నమల్లారెడ్డిలో తిరిగి కొత్తగా సొసైటీలు ప్రతిపాదించారు. 
  • పిట్లం మండల కేంద్రం పెద్దదైనా ఇక్కడ సొసైటీ లేకపోవడంతో రైతులు చిల్లర్గి సొసైటీకి వెళ్లాల్సి వస్తోంది.   

ప్రపోజల్స్​ పంపాం

జిల్లాలో మరో 10 సొసైటీల ఏర్పాటుకు ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపించాం. ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇస్తే సొసైటీలు ప్రారంభిస్తాం. దీంతో రైతులు తమ గ్రామాల దగ్గరలోనే ఎరువులు, విత్తనాలు, రుణాలు వంటి సేవలు పొందచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో రామారెడ్డి, పిట్లం వంటి కొన్ని మండలాల్లో సొసైటీలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాంమోహన్​రావు, జిల్లా సహకార అధికారి 

3 సొసైటీలకు పర్సన్​ ఇన్​చార్జీలు

కామారెడ్డి, వెలుగు :  జిల్లాలోని 3 సొసైటీలకు పర్సన్​ ఇన్​చార్జీలను నియమించారు.  జిల్లాలో 55 సొసైటీలు ఉన్నాయి.  వీటి పాలక వర్గాల గడువు గత నెల ముగిసింది.  ఎన్నికలు జరగనందున పాలక వర్గాల గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 52 సంఘాల పాలక వర్గాలకు గడువు ఇస్తూ జిల్లా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. 

తాడ్వాయి, భిక్కనూరు మండలం బస్వాపూర్​, బీర్కుర్ మండలం బైరాపూర్​ సొసైటీల పాలక వర్గం గడువు పెంచలేదు. ఈ సొసైటీ చైర్మన్లు, వైస్​ చైర్మన్లపై  వివిధ రకాల అభియోగాలు ఉండడంతో సహకార శాఖ అధికారులను పర్సన్​ ఇన్​చార్జీలుగా నియమించినట్లు జిల్లా సహకార అధికారి రాంమోహన్​రావు పేర్కొన్నారు.

కొత్తగా ప్రతిపాదించిన సొసైటీ గ్రామాలు.. 

మండలం         గ్రామం
కామారెడ్డి           గర్గుల్, చిన్నమల్లారెడ్డి 
రామారెడ్డి          మండల కేంద్రం, అన్నారం 
పాల్వంచ         మండల కేంద్రం 
గాంధారి            మాతుసంగెం 
లింగంపేట      భవానిపేట 
పిట్లం                మండల కేంద్రం 
జుక్కల్             ఖండెబల్లూర్ 
బాన్సువాడ      హన్మాజిపేట