క్రాప్ సీజన్ .. ముందుకు మారుద్దామా

క్రాప్ సీజన్ .. ముందుకు మారుద్దామా
  • స్టడీ కోసం వర్షాధార పంటల సాగు సర్వే
  • క్లస్టర్ వారీగా డేటా సేకరిస్తున్న ఏఈవోలు
  • రేపు సర్వే పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్రాప్ సీజన్​ను ముందుకు మార్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై స్టడీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. యాసంగిలో అకాల వర్షాల నుంచి పంటలను కాపాడేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాధార పంటల సాగు విస్తీర్ణం వివరాలు సేకరిస్తున్నది. ఈ వానాకాలం సాగయ్యే పంటల్లో వర్షాధార పంటల వివరాల నమోదును ఈ నెల 7న ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో సర్వే చేసి క్రాప్​బుకింగ్​యాప్​లో డేటా నమోదు చేసే పనిని 2600 మంది అగ్రికల్చర్ ఎక్స్​టెన్షన్ ఆఫీసర్​(ఏఈవో)లకు అప్పగించింది. ఈనెల 10వ తేదీ వరకు మొత్తం వివరాలను పంపించాలని   ఆదేశించింది. 

క్రాప్ బుకింగ్ యాప్​లో అప్​లోడ్

రెవెన్యూ, ఇరిగేషన్, స్టాటిస్టికల్ ఆఫీసర్ల సమన్వయంతో అగ్రికల్చర్​ క్లస్టర్​ల వారీగా వర్షాధార పంటల సాగు ఏరియా సర్వే జరుగుతున్నది. 15 అంశాలతో సేకరించిన డేటాను క్రాప్ బుకింగ్ యాప్​లో అప్​లోడ్ చేస్తున్నారు. గ్రామం, ఆ గ్రామంలో గత వానాకాలంలో పంటసాగు విస్తీర్ణం, బావులు, బోరు బావుల కింద సాగైన విస్తీర్ణం, కాల్వాల ద్వారా సాగయ్యే భూమి, చెరువులు, కుంటల కింద సాగయ్యే భూమి, సాగునీటి వనరుల ద్వారా సాగయ్యే మొత్తం భూమి, వర్షం ఆధారంగా సాగయ్యే పంట భూముల వివరాలు సేకరిస్తున్నారు.

కమిషనరేట్ నుంచి మానిటరింగ్

సర్వే మానిటరింగ్ బాధ్యతలను అగ్రికల్చర్ కమిషనరేట్​కు చెందిన 11మంది డీడీఏ, ఏడీఏ స్థాయి అధికారులకు అప్పగించింది. ఒక్కో అధికారికి మూడు జిల్లాల బాధ్యతలను కేటాయించింది. గ్రామాల వారీగా వర్షాధార పంట ప్రాంతాల డేటా సేకరించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.