వన్యప్రాణులను, పర్యావరణాన్ని కాపాడాలి : మంత్రి కొండా సురేఖ

వన్యప్రాణులను, పర్యావరణాన్ని కాపాడాలి : మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: అభివృద్ధి పేరిట అడవులు, జంతువుల పట్ల మనుషుల వైఖరిలో విపరీతమైన మార్పులు వస్తున్నాయని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వన్యప్రాణుల మనుగడ ఆందోళనకరంగా మారిందన్నారు. మనతో పాటు రానున్న తరాలకు కూడా నివాసయోగ్యమైన పరిసరాలు కావాలంటే అన్ని జీవరాసుల మనుగడ, సహజీవన సూత్రాన్ని కొనసాగించాలని మంత్రి సూచించారు. జంతువులు, పక్షులు, వృక్ష జాతులతో కూడిన పర్యావరణ రక్షణ అనేది ప్రతిఒక్కరి సంకల్పం కావాలని ఆమె సూచించారు. ఆదివారం వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా మంత్రి సందేశం రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని, వన్యప్రాణుల మనుగడ, రక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తూ ఏటా మార్చి 3 న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.   

మనుషులు, జంతువుల మధ్య సంఘర్షణ పెరుగుతోందని, జంతు ఆవాసాల్లోకి మనుషుల చొరబాట్ల వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. మనుషుల నిర్లక్ష్యంతో అడవుల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలను నివారించాలని సూచించారు. అటవీ మార్గాల్లో ప్రయాణాల్లో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎండాకాలంలో జంతువులు, పక్షుల నీటి వసతికి అందరూ సహకరించాలని కోరారు. అటవీ నేరాల అదుపునకు, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ నివారణకు ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ యంత్రాంగానికి తోడ్పాటునందించాలని విజ్ఞప్తి చేశారు.