
బిజినెస్ డెస్క్, వెలుగు: అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌లు దివాలా తీయడంతోపాటు, మరో పెద్ద బ్యాంకు క్రెడిట్ స్వీస్ దివాలా అంచులకు చేరిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బులు పెట్టిన వారిలో సహజంగానే ఆందోళన పెరుగుతోంది. మన దేశంలో బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టిన ఇన్వెస్టర్లకు ఉన్న రక్షణ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏదైనా బ్యాంకు ఫెయిలైనప్పుడు డిపాజిట్లలో డబ్బు పెట్టిన వారికి ఉండే ఏకైక రక్షణ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) మాత్రమే. డీఐసీజీసీ ఇచ్చే ఇన్సూరెన్స్ కవర్‌ను 2020 ఫిబ్రవరి 4 నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. అంటే రూ. 5 లక్షల వరకు డిపాజిట్లు ఉన్నవారికే ఇన్సూరెన్స్ దక్కుతుంది. అంతకు ముందు ఇది కేవలం రూ. లక్షే. డిపాజిట్లపై ఇన్సూ రెన్స్ కోసం మరొక ఆప్షన్ అందుబాటులో ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై రూ. 65 లక్షల దాకా ఇన్సూరెన్స్ కవర్‌ను పొందే వెసులుబాటు దీని వల్ల కలుగుతుంది. ఒకే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లున్నా, ఈ ఆప్షన్ కుదురుతుంది. సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, కరెంట్ అకౌంట్లు, రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీ) వంటి వాటిపై డీఐసీజీసీ ఇన్సూరెన్స్ కవరేజ్ అందుబాటులో ఉంటుంది.
ఇదెలా పనిచేస్తుందంటే...
ఏదైనా బ్యాంకు లిక్విడేషన్ జరిగినప్పుడు లేదా ఆ బ్యాంకు లైసెన్స్ క్యాన్సిల్ అయినప్పుడు అసలు, దానిపై వడ్డీ కలిపి రూ. 5 లక్షల మొత్తానికి డీఐసీజీసీ ఇన్సూరెన్స్ కవరేజ్ దొరుకుతుంది. ఒకే హక్కుతో, ఒకే కెపాసిటీలో పెట్టే అకౌంట్లు అన్నింటిలోనూ, అంటే సేవింగ్స్, కరెంట్ అకౌంటు, ఎఫ్డీ లేదా ఆర్డీ అన్నింటికీ కలిపే ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందన్నమాట. అసలు, దానిపై వడ్డీ ఇందులోనే కలిసి ఉంటాయని మర్చిపోకూడదు. ఉదా. ఒకరి ప్రిన్సిపల్ అమౌంట్ రూ. 5 లక్షలనుకుంటే, ఇన్సూరెన్స్కవరేజ్ అంతదాకానే ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ అమౌంట్‌పై అప్పటిదాకా అక్యుములేట్ అయిన వడ్డీకి ఇన్సూరెన్స్ కవరేజ్ దొరకదు. ఒకవేళ ప్రిన్సిపల్, దానిపై వడ్డీ కలిపిన తర్వాత ఉండే మొత్తం రూ. 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే మాత్రం ఎంత మొత్తం ఉంటే అంత మొత్తమూ తిరిగి పొందేందుకు వీలుంటుంది. కాబట్టి, ఇన్సూరెన్స్ కవరేజ్ లెక్కించుకునేటప్పుడు మెచ్యూరిటీ అమౌంట్‌ను పరిగణనలోకి తీసుకోవడం మేలు. ఒకవేళ డిపాజిట్‌పై వడ్డీ ని ఎప్పటికప్పుడు తీసుకుంటుంటే లెక్కింపులో ఎలాంటి సమస్య ఉండదు.
ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ ఎలా దొరుకుతుంది..
వేరు వేరు హక్కులు, కెపాసిటీలలో కనక మనం మన డిపాజిట్లను పెడితే అలాంటప్పుడు ప్రతీ డిపాజిట్‌కు రూ. 5 లక్షల దాకా ఇన్సూరెన్స్ కవరేజ్ దొరుకుతుందని డీఐసీజీసీ గైడ్‌లైన్స్ చెబుతున్నాయి. ఒకే బ్యాంకులో డిపాజిటర్లు వివిధ ఫిక్స్డ్ డిపాజిట్లను వేరు వేరు హక్కులు, కెపాసిటీలతో ఓపెన్ చేయొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, స్పౌజ్ (భార్య లేదా భర్త), సోదరుడు, పిల్లలతో కలిసి జాయింట్‌గా ఎఫ్డీ ఓపెన్ చేయడన్నమాట. అలాగే, ఏదైనా ఫర్మ్‌లో పార్ట్నర్గా, మైనర్‌కు గార్డియన్‌గా ...ఇలా వేరు వేరు కెపాసిటీలలో ఉండే డిపాజిట్లకు వేరు వేరుగా రూ. 5 లక్షల దాకా ఇన్సూరెన్స్ కవరేజ్ పొందే వెసులుబాటు ఉంది. కాబట్టి, ఇన్సూరెన్స్ డిపాజిట్ కవరేజ్ ఎక్కువ చేసుకోవాలంటే మనం ఎఫ్డీ చేసేప్పుడు వేరు వేరు హక్కులు, కెపాసిటీలతో చేసుకోవడం మేలని ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కల్నల్ సంజీవ్ గోవిలా సలహా ఇస్తున్నారు. ఉదా. ఏ అనే ఒక వ్యక్తి కుటుంబంలో ఆరుగురు మెంబర్లున్నారనుకుందాం. ఈ ఏ అనే వ్యక్తి తన పేరుతో ఒక డిపాజిట్ ఓపెన్ చేశారనుకుంటే, ఒక ఫర్మ్‌లో పార్ట్నర్గా, మైనర్ పిల్లలకు గార్డియన్‌గా, లేదా కంపెనీలో డైరెక్టర్‌గా, ట్రస్టులో ట్రస్టీ కెపాసిటీలో, తన భార్యతో కలిసి ఒక జాయింట్ అకౌంట్, తన తల్లి, తండ్రులతో కలిసి వేరు వేరు జాయింట్ అకౌంట్లు..ఇలా వేరు వేరు హక్కులు, కెపాసిటీలతో డిపాజిట్ అకౌంట్లను ఏ అనే వ్యక్తి ఓపెన్ చేసుకోవడానికి వీలుంటుంది. అలాంటప్పుడు ఆయా డిపాజిట్లన్నింటిపైనా కవరేజ్ పొందే అవకాశం చిక్కుతుంది. ఒక్కో డిపాజిట్పైనా రూ. 5 లక్షల లిమిట్ అనుకున్నా..గరిష్టంగా రూ. 65 లక్షల దాకా ఇన్సూరెన్స్ కవరేజ్ పొందొచ్చు. కానీ,ఇండివిడ్యువల్‌గా ఒక డిపాజిట్ అకౌంట్, ప్రొప్రైటర్ హోదాలో మరో డిపాజిట్ అకౌంటు తెరిచినప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచుకోవడం వీలవదు. ఈ రెండింటినీ కలిపి ఒకే అకౌంటుగా పరిగణించి, రూ. 5 లక్షల వరకే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు.
ఇలా జాగ్రత్తపడండి...
యెస్ బ్యాంక్, పీఎంసీ బ్యాంకు వంటి మన దేశంలోని బ్యాంకులు కూడా ఇటీవల కాలంలో ఫెయిల వడం మనం చూశాం. కాబట్టి, మన డిపాజిట్లను కాపాడుకోవా లంటే మన దగ్గరున్న మొత్తమంతా ఒకే ఫిక్స్డ్ డిపాజిట్‌గా పెట్టడం మంచిది కాదు. వీలైతే వేరు వేరు హోదాలు, కెపాసిటీలలో ఆ మొత్తా న్ని విభజన చేసి ఫిక్స్డ్ డిపాజిట్లుగా పెట్టుకోవడం మేలనేది నిపుణుల సూచన.
అన్ని బ్యాంకులకూ డీఐసీజీసీ ఇన్సూరెన్స్..
దేశంలోని అన్ని కమర్షియల్ బ్యాంకులు, ఫారిన్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులలోని డిపాజిట్లపై డీఐసీజీసీ ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది. ప్రైమరీ కో–ఆపరేటివ్ సొసైటీలలోని డిపాజిట్లు మాత్రం డీఐసీజీసీ పరిధిలోకి రావు. అంతేకాదు, ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీ లేదా ఇతర కార్పొరేట్ సంస్థలలోనూ డీఐసీజీసీ ఇన్సూరెన్స్ కవరేజ్ అందుబాటులో ఉండదు.