మంత్రి కొప్పులకు నిరసన సెగ 

మంత్రి కొప్పులకు నిరసన సెగ 

జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు నిరసన సెగ తాకింది. జిల్లా కేంద్రంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించేందుకు వెళ్తుండగా..మార్గం మధ్యలో మంత్రిని రైతులు అడ్డుకున్నారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ రైతులు రోడ్డుపై బైటాయించారు. చేసేదేం లేక మంత్రి వెనుదిరిగారు. ఇవాళ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా అష్టదిగ్బంధనానికి రైతు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. దీంతో పలు గ్రామాల రైతులు రాస్తారోకోలు చేపట్టారు. ఈ క్రమంలో మంత్రి కంటి వెలుగు కార్యక్రమాన్ని వాయిదా చేసుకున్నారు. ధర్మపురిలో జరిగే మరో కార్యక్రమానికి ఆయన హాజరుకానునట్లు తెలుస్తోంది.

కాగా, జగిత్యాల మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇవాళ మాస్టర్ ప్లాన్ ప్రభావిత గ్రామాల ప్రజలు రోడ్ల దిగ్బంధనం చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ ఈ నెల 7 నుంచి ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముందుగా నర్సింగాపూర్ గ్రామంలో మాస్టర్ ప్లాన్ వ్యతిరేకంగా గ్రామ సభ నిర్వహించారు. తర్వాత హస్నాబాద్, అంబారిపేట గ్రామస్తులు జగిత్యాల–నిజామాబాద్ రహదారిపై రాస్తారోకో చేయాలని నిర్ణయించుకున్నారు. నర్సింగాపూర్, థరూరు గ్రామాల ప్రజలు కరీంనగర్–జగిత్యాల హైవేపై రాస్తారోకోకు పిలుపునిచ్చారు. జగిత్యాల–ధర్మారం మార్గంలో తిమ్మాపూర్ గ్రామస్తుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.