
250 మంది అరెస్టు.. 80 వేల మంది పోలీసుల మోహరింపు
పారిస్: ఫ్రాన్స్ ఆందోళనలతో అట్టుడుకుతున్నది. దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నియమించిన కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకోర్నూను వ్యతిరేకిస్తూ యువత రోడ్డెక్కింది. ‘బ్లాక్ ఎవ్రీథింగ్’ ఉద్యమాన్ని తీవ్రం చేసింది. దేశ రాజధాని పారిస్ సహా ఇతర పట్టణాల్లో బుధవారం (సెప్టెంబర్ 10) నిరసనలు చేపట్టింది. ఎక్కడికక్కడ రోడ్లను బ్లాక్ చేసి, చెత్తను పారబోసింది.
వాహనాలకు నిప్పు పెట్టింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం కావడంతో, వాటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఏకంగా 80 వేల మంది పోలీసులను మోహరించింది. ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించింది. ఇప్పటికే దాదాపు 250 మంది నిరసనకారులను అరెస్టు చేసింది. బుధవారం ఉదయం నుంచే పారిస్‌లో జనం ఆందోళనలు చేపట్టారు.
దేశంలో సంక్షోభం..
ఫ్రాన్స్‌లో రాజకీయ, ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. మాక్రాన్ పార్టీకి మెజార్టీ లేకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నది. ఈ క్రమంలో గత ఏడాది కాలంలో ముగ్గురు ప్రధానులు మారారు. ప్రస్తుత ప్రధాని ఫ్రాంకోయిస్ కూడా దిగిపోవాల్సి వచ్చింది. దీంతో కొత్త ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్నూను మాక్రాన్ నియమించారు. ఇదే ఆందోళనలకు దారితీసింది.