వరద నష్టంపై పూర్తి స్థాయి రిపోర్ట్‌‌‌‌ ఇవ్వండి.. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం

వరద నష్టంపై పూర్తి స్థాయి రిపోర్ట్‌‌‌‌ ఇవ్వండి.. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం

ఆసిఫాబాద్/జైనూర్, వెలుగు : వరదల కారణంగా జరిగిన నష్టంపై పూర్తిస్థాయిలో సర్వే చేసి రిపోర్ట్‌‌‌‌ రెడీ చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్‌‌‌‌ వెంకటేశ్‌‌‌‌ ధోత్రే, ఎస్పీ కాంతిలాల్‌‌‌‌ పాటిల్‌‌‌‌, అడిషనల్‌‌‌‌ కలెక్ట ర్లు దీపక్‌‌‌‌ తివారి, ఎం.డేవిడ్, కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ సబ్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ శ్రద్ధ శుక్లా, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి బుధవారం కలెక్టరేట్‌‌‌‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైనందున వాగులు, ఒర్రెలు, నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించాయని, దీని వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయన్నారు. 

రోడ్లు, హైవేలు, కల్వర్టులు, బ్రిడ్జిలు కొట్టుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వర్షాల కారణంగా ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు 6,453 ఎకరాల్లో పత్తి, వరి, ఇతర పంటలకు నష్టం జరిగిందని, సుమారు 3,100 మంది రైతులు నష్టపోయారన్నారు. వ్యవసాయ శాఖ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం, రైతుల వివరాలతో రిపోర్ట్‌‌‌‌ సమర్పించాలని, సర్వే ప్రక్రియలు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించారు. 

చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని చెప్పారు. కొట్టుకుపోయిన రోడ్లకు త్వరగా రిపేర్లు పూర్తి చేయాలని చెప్పారు. అధికారులు సమన్వయంతో పని చేసి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. 

అంతకుముందు ఆసిఫాబాద్‌‌‌‌ మండలం రాజురా గ్రామానికి వెళ్లే రోడ్డులోని బ్రిడ్జి, రెబ్బెన మండలం ఎన్‌‌‌‌టీఆర్‌‌‌‌ కాలనీని మంత్రి పరిశీలించారు. అలాగే జిల్లా కేంద్రంలోని కుమ్రంభీం విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాల వేసిన నివాళులర్పించారు. మంత్రి వెంట ఏఎస్పీ చిత్తరంజన్‌‌‌‌, మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అదిలాబాద్ పార్లమెంట్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జి ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి శ్యామ్‌‌‌‌ నాయక్‌‌‌‌ ఉన్నారు.

వెల్ఫేర్‌‌‌‌ హాస్టల్‌‌‌‌లో వసతులు కల్పిస్తున్నం

జైనూర్‌‌‌‌ మండలం మర్లవాయి గ్రామంలోని ప్రభుత్వ బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్‌‌‌‌లో మంగళవారం రాత్రి మంత్రి బస చేశారు. బుధవారం ఉదయం స్టూడెంట్లతో కలిసి టిఫిన్‌‌‌‌ చేశారు. ఈ సందర్భంగా వంటగది, టీచర్లు, స్టూడెంట్ల హాజరు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్టూడెంట్లతో మాట్లాడుతూ... మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టూడెంట్లను కొన్ని ప్రశ్నలు వేయడంతో వారు సమాధానం చెప్పలేకపోవడంతో టీచర్లను మందలించారు. మూడు నెలల్లో మార్పు రావాలని ఆదేశించారు.