ఉస్మానియా ఆస్పత్రి తరలింపు వివరాలివ్వండి: రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం

ఉస్మానియా ఆస్పత్రి తరలింపు వివరాలివ్వండి: రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్‌ స్టేడియానికి తరలించాలని తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్‌ స్టేడియంలో కొత్త భవనం నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలంటూ రాము అనే వ్యక్తి పిల్‌ దాఖలు చేశారు. దీనిని చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి. ఎం.మొహియుద్దీన్‌ల డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారించింది.

స్టేడియానికి చెందిన స్థలాన్ని ఆస్పత్రి కోసం బదలాయింపునకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమని పిటిషనర్‌ లాయర్‌ వాదించారు. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ.. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేసినట్లు చెప్పారు. పేదలకు వైద్య సేవలు అందించాలన్న నిర్ణయంలో జోక్యం చేసుకోవద్దని కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేస్తామని చెప్పారు. దీంతో విచారణ సెప్టెంబర్‌ 26కు వాయిదా పడింది.

హాస్టల్‌ స్టూడెంట్ల అస్వస్థతకు కారణాలేంటి? 
నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఉయ్యాలవాడలోని మహాత్మాజ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ పాఠశాలలో 110 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి కారణాలు చెప్పాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి వివరణ ఇవ్వాలంది. కలుషిత ఆహారంలో విద్యార్థులు తినడం వల్ల అస్వస్థతకు గురైన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

వసతి గృహాలు, స్కూళ్లల్లో వసతుల కల్పనలో బాలల హక్కుల జాతీయ కమిషన్‌ గైడ్‌లైన్స్‌ అమలు చేయడం లేదంటూ కె.అఖిల్‌ శ్రీగురుతేజ పిల్‌ దాఖలు చేశారు. దీనిని చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్, జస్టిస్‌ జి. ఎం మొహియుద్దీన్‌ల డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారించింది. లాయర్‌ చిక్కుడు ప్రభాకర్‌ వాదిస్తూ.. హాస్టల్స్‌లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు లేవని, పిల్లలకు పౌష్టికాహారం అందించడం లేదని చెప్పారు. ప్రభుత్వ వివరాలపై ఈ పిటిషన్​పై సెప్టెంబర్‌ 3న విచారణ జరుపుతామని బెంచ్‌ వెల్లడించింది.