మైదాకు బదులు అరటి పిండి!

మైదాకు బదులు అరటి పిండి!

అరటిపండ్లు ఏ సీజన్‌‌లోనైనా దొరుకుతాయి. అన్ని పండ్లలాగే వీటి ధర కూడా మార్కెట్లో కొన్నిసార్లు పెరుగుతుంది. ఇంకొన్నిసార్లు తగ్గుతుంది. ధర తగ్గితే డజను అరటిపండ్లకు నాలుగైదు రూపాయలకు మించి రావు. డిమాండ్‌‌ విపరీతంగా తగ్గిపోతుంది. ధర, డిమాండ్‌‌ లేకపోవడంతో అరటిపండ్లను ఏం చేయాలో తెలియదు రైతులకు. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కున్నారు కర్ణాటక రైతులు. అదే అరటి పిండి (బనానా ఫ్లోర్‌‌‌‌). ఉత్తర, దక్షిణ కర్ణాటకలో రైతులు అరటిని ఎక్కువగా పండిస్తారు. కొన్నిసార్లు డిమాండ్‌‌ లేకపోవడంతో పండిన పంట వేస్ట్‌‌ అవుతుంది. అయితే, అరటిని పిండిగా మారిస్తే మంచి లాభాలుంటాయని నిరూపిస్తున్నారు కర్ణాటకలోని తుమ్కూర్‌‌‌‌ జిల్లాకు చెందిన నయన ఆనంద్‌‌. బనానా ఫ్లోర్‌‌‌‌ ఉపయోగాలపై శ్రీ పాడ్రే అనే ఒక జర్నలిస్ట్‌‌ చేసిన ఫేస్‌‌బుక్‌‌ పోస్ట్‌‌ నయనలో ఈ ఆలోచన తీసుకొచ్చింది. శ్రీ పాడ్రేతో మాట్లాడి, బనానా ఫ్లోర్‌‌‌‌ గురించి తెలుసుకుంది. ఇప్పుడు నయన కూడా బనానా ఫ్లోర్‌‌‌‌ తయారు చేస్తూ, మరెందరికో ఇన్‌‌స్పిరేషన్‌‌గా నిలుస్తోంది. అరటి పండ్లకు డిమాండ్‌‌ లేక నష్టపోయే రైతులకు ఆల్టర్నేటివ్‌‌ మార్కెటింగ్‌‌ను పరిచయం చేస్తోంది. వందకుపైగా రైతు కుటుంబాలు ఇప్పుడు బనానా ఫ్లోర్‌‌‌‌ తయారుచేస్తున్నాయి. మరికొంతమంది కూడా ఇదే దారిలో ఉన్నారు.
ఎలా చేస్తారు..?
అరటి పండ్లను కనీసం మూడు రోజులు ఎండబెడతారు. పచ్చి అరటి పండ్లు, తొక్కతో ఉన్నవి, తొక్క తీసేసినవి.. ఇలా ఏ రకంగానైనా అరటి పండ్లను చిన్న ముక్కలుగా కట్‌‌ చేసి బాగా ఎండబెడతారు. ఆ తర్వాత వాటిని పిండి పట్టిస్తారు. తక్కువ ముక్కలు ఉంటే, ఇంట్లోనే మిక్సీ గ్రైండర్‌‌‌‌లో పిండి చేసుకోవచ్చు. ఎక్కువ ఉంటే మిల్లులో పిండి పట్టించొచ్చు. సాధారణంగా అరటి పండ్లు ఎండేందుకు మూడు, నాలుగు రోజులు చాలు. వర్షాకాలం డ్రయ్యర్లు వాడతారు. డ్రయ్యర్లతో అయితే ఏ సీజన్‌‌లో అయినా అరటిని ఎండబెట్టొచ్చు. అరటిపిండిని ప్యాక్‌‌ చేసి అమ్ముతున్నారు. ఇప్పుడిప్పుడే ఇక్కడి రైతులు మార్కెటింగ్‌‌ మొదలుపెట్టారు. త్వరలో పూర్తిస్థాయిలో సేల్స్‌‌ చేస్తామని చెప్పింది నయన. 
బోలెడు వంటలు
అరటి పిండిని చాలావరకు మైదా పిండికి బదులుగా వాడొచ్చంటోంది నయన. వీటితో కర్ణాటకలో చాలా రకాల వంటలు తయారుచేస్తున్నారు. దోశె, పూరి, కేక్స్, గులాబ్‌‌ జామ్స్‌‌, రోటీలు, చపాతీలు, కట్లెట్స్‌‌, పొంగనాలు వంటివెన్నో చేయొచ్చంట. బేబీ ఫుడ్‌‌గా కూడా ఈ పిండిని వాడొచ్చు అంటున్నారు. బ్రెడ్‌‌తోపాటు, బేకరీ ఐటమ్స్‌‌లోనూ బనానా ఫ్లోర్‌‌‌‌ వాడుతున్నారు. అయితే, ప్రస్తుతం రైతులు చుట్టుపక్కల ప్రాంతా ల్లోనే అమ్ముతున్నారు. త్వరలోనే అన్ని చోట్లకి ఎక్స్‌‌పోర్ట్‌‌ చేస్తామంటున్నారు. కొన్ని కంపెనీలు ఇప్పటికే బనానా ఫ్లోర్‌‌‌‌ను అమ్ముతున్నాయి. ఆన్‌‌లైన్‌‌లో కూడా ఈ పిండి దొరుకుతోంది.