విజయవంతమైన పీఎస్‌ఎల్వీ సీ-51.. స్పెస్‌లోకి తొలిసారిగా మోడీ, భగవద్గీత ఫోటోలు

విజయవంతమైన పీఎస్‌ఎల్వీ సీ-51.. స్పెస్‌లోకి తొలిసారిగా మోడీ, భగవద్గీత ఫోటోలు

ఈ ఏడాది మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి తొలిసారి ఇస్రో కమర్షియల్ విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని చేసింది. బ్రెజిల్‌కు చెందిన అమెజానియా1తో పాటు మన దేశానికి చెందిన మరో 18 ఉపగ్రహాలు, ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో, భగవద్గీతను లోడ్ చేసిన ఎస్డీ కార్డును పీఎస్‌ఎల్వీ సీ-51 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఇస్రో చేస్తున్న తొలి ప్రయోగం ఇది కావడం విశేషం. ప్రైవేట్ సంస్థలకు చెందిన 5 ఉపగ్రహాలు, విదేశాలకు చెందిన 14 ఉపగ్రహాలను ఈ పీఎస్‌ఎల్వీ నింగిలోకి మోసుకెళ్లింది. పీఎస్‌ఎల్వీ సీరిస్‌లో ఇది 53వ ప్రయోగం.

అమెజానియాతో పాటు ఇస్రో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ తయారు చేసిన నాలుగు, ఎన్ఎస్ఐఎల్ తయారు చేసిన 14 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్‌కి చెందిన ఉపగ్రహాల్లో 3 యూనిటీశాట్లున్నాయి. నాలుగోది చెన్నైకి చెందిన స్పేస్ కిడ్జ్​ ఇండియా(ఎస్కే ఐ) తయారు చేసిన సతీశ్ ధావన్ శాట్(ఎస్డీ శాట్ ). ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు, అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నందుకు గానూ గౌరవ సూచకంగా ప్రధాని మోడీ ఫొటోను పెట్టి ఎస్డీ శాట్‌ను పంపిస్తున్నట్టు ఎస్కే ఐ ప్రకటించింది.