వానొస్తే రాకపోకలకు తిప్పలే

వానొస్తే రాకపోకలకు తిప్పలే

వరద నీటిలో అవస్థలు పడుతున్న జనం

కామారెడ్డి , వెలుగు: వానాకాలం వచ్చిందంటే ఊరి నుంచి పంట పొలాలతో పాటు ఇతర ఊర్లకు వెళ్లేందుకు ఇక్కడి జనం పడతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. వరద నీటిలో అవస్థలు పడుతూ వెళ్తున్నారు. ఊరికి మరో దారి ఉన్నా అది చుట్టూరా తిరగాల్సి ఉండడంతో కష్టమైనా ఇదే దారిలో రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పలుమార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఒక ఎల్లారం గ్రామమే కాదు.. వానాకాలంలో  కామారెడ్డి జిల్లాలో ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గంలో అనేక ఊర్లకు ఈ కష్టాలు తప్పడం లేదు. కొన్ని ఊర్లలో వాగులు పొంగి ప్రవహిస్తున్న వేళ బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఆటోలపై సర్కస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీట్లు చేస్తూ వెళ్తుంటారు. బిచ్కుంద, పిట్లం, మద్నూర్, జుక్కల్, పెద్దకొడప్​గల్ మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. జిల్లా కేంద్రానికి దూరంగా,  మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో ఉండే ఈ ఏరియాలకు రవాణా సౌకర్యాలు లేవు. రోడ్లు సరిగ్గా లేకపోవడం,  వాగులు, వంకలపై బ్రిడ్జిలు లేక ఆర్టీసీ బస్సులు, ఆటోలు కూడా రావడం లేదు.  బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై లేదా నడ్చుకుంటూ వెళ్తుంటారు.  జిల్లా వ్యాప్తంగా   40 ఊర్ల జనం వానకాలంలో రాకపోకలకు అరిగోస పడుతున్నారు.  

పలుమార్లు ప్రస్తావనకు వచ్చినా...

పలు మార్లు ఆయా ఊర్లకు రోడ్ల నిర్మాణం విషయం జడ్పీ, ఇతర మీటింగుల్లో ప్రస్తావనకు వచ్చినప్పటికీ ప్రాబ్లమ్స్​క్లియర్​ కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. బిచ్కుంద, నాగిరెడ్డిపేట, గాంధారి, మాచారెడ్డి, తాడ్వాయి మండలాల్లో  కొన్ని ఊర్లకు ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అభ్యంతరం తెలుపతుండడంతో రోడ్ల నిర్మాణం జరగడం లేదు. ప్రజాప్రతినిధులు చొరవ చూపి తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. 

జిల్లాలో 17.8 మి.మీ వర్షపాతం

నిజామాబాద్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో 17.8 మిల్లిమీటర్ల  సగటు వర్షపాతం నమోదైంది. రుద్రూర్, కోటగిరి మండలాల్లో అత్యధికంగా 38 మి.మీ, ఇందల్వాయి మండలంలో 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 1042 మిల్లిమీటర్లు కాగా ఇప్పటి వరకు జిల్లాలో  1141.5 మి.మీ వర్షం కురిసింది. జిల్లాలోని కాజ్ వే వంతెనలు, శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిలపై రాకపోకలు నిలిపివేశారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలను ప్రజలను అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అధికారులంతా అందుబాటులో ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు.

తిప్పలు పడుతూ వెళ్తాం

మా ఊరి నుంచి మండల కేంద్రంతో పాటు పంట పొలాలకు వెళ్లటానికి ఈ దారే అనుకూలంగా ఉంటుంది. వానకాలం షురు అయినప్పటి నుంచి దీపావళి వరకు ఈ దారిలో వెళ్లేందుకు మాకు ఎప్పుడూ తిప్పలే ఉంటాయి. ఇక్కడ బ్రిడ్జి కట్టాలని ఆఫీసర్లకు చాలా సార్లు చెప్పాం. ఏవరూ పట్టించుకంటలేరు.

– నారాయణ, ఎల్లారం

వరద నీటిలో పడుతున్నాం

వాన పడినప్పుడల్లా ఈ దారిలో వెళ్లేందుకు నరకం చూస్తున్నాం. వరద నీటిలో నుంచి బైకులపై  వెళ్లేటప్పడు కింద పడి గాయాలవుతున్నాయి.  బైకులు కూడా పాడవుతున్నాయి. రోడ్డు వేసి బ్రిడ్జి కడితే మాకు మేలు జరుగుతుంది.

– కిష్టయ్య, ఎల్లారం