ప్రజల ఆప్యాయతను మరువలేను : తమిళిసై

ప్రజల ఆప్యాయతను మరువలేను : తమిళిసై
  •     మీడియాతో గవర్నర్​ తమిళిసై
  •     న్యూ ఇయర్​ విషెస్ చెప్పిన పబ్లిక్, అధికారులు
  •     గవర్నర్ పేరుతో వాట్సాప్ చానల్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు : న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గవర్నర్​ తమిళిసైకి విషెస్ ​చెప్పారు. తనకు విషెస్ చెప్పేందుకు గంట పాటు టైమ్ ఇస్తున్నట్లు గవర్నర్ ప్రకటించటంతో సోమవారం ఉదయం 9 గంటల నుంచే పబ్లిక్, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు భారీగా వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 3,500 మంది రాజ్ భవన్ కు వచ్చి సుమారు 4 గంటల పాటు గవర్నర్ ను కలిసి ప్రతి ఒక్కరూ విషెస్ చెప్పారు. బొకేలు, శాలువాలు వద్దని రెండు రోజుల క్రితమే సూచించగా..

నోట్ బుక్స్ తీసుకొచ్చి గవర్నర్ కు అందజేశారు. అనంతరం రాజ్ భవన్ లో గవర్నర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. తనను కలవటానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ప్రేమ, ఆప్యాయతను మరువలేనన్నారు. గవర్నర్ పేరుతో వాట్సాప్ చానల్ ను లాంఛ్ చేశామని, ఇప్పటి నుంచి రాజ్ భవన్ కు సంబంధించి అన్ని అప్ డేట్స్  ఆ చానల్ లో అప్ లోడ్ చేస్తామని తెలిపారు.   

విషెస్ చెప్పిన సీఎం, స్పీకర్, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ లు

న్యూ ఇయర్ సందర్భంగా గవర్నర్ తమిళిసైకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా విషెస్ చెప్పారు. వీరితో పాటు  ఐఏఎస్, ఐపీఎస్ , ఐఎఫ్​ఎస్​లు  పెద్ద సంఖ్యలో వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది వరకు సీఎంతో పాటు అధికారులు కూడా రాజ్ భవన్ కు వచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వం మారడం, సీఎం కూడా రావడంతో ఉన్నతాధికారులు కలిసి వచ్చి విషెస్ చెప్పారు. ఎంసీ హెచ్ ఆర్డీలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధేను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కలిసి న్యూఇయర్​ విషెస్ చెప్పారు.

గవర్నర్​కు అయోధ్య అక్షింతలు

గవర్నర్ తమిళిసైకి అయోధ్య రాముల వారి అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు సోమవారం రాజ్ భవన్ లో  అందజేశారు. ప్రపంచంలోని ప్రతి హిందువుకు రాముల వారి అక్షింతలు అందజేసి, రాజకీయాలకు అతీతంగా అయోధ్య రామ జన్మభూమి దర్శనానికి ఆహ్వానిస్తున్నట్లు సభ్యులు చెప్పారు. గవర్నర్ ను సంప్రదాయబద్ధంగా రామమందిర దర్శనానికి ఆహ్వానం పలికినట్లు వీహెచ్​పీ ప్రచార ప్రముఖ్ పగడాకుల బాలస్వామి తెలిపారు.