ఆర్టీసీ సమ్మెతో ప్రజలకు తప్పని తిప్పలు

ఆర్టీసీ సమ్మెతో ప్రజలకు తప్పని తిప్పలు

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆదివారం రెండో రోజూ కొనసాగింది. ప్రభుత్వం దిగిరాకపోవడంతో సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పండుగ సీజన్​ కావడంతో నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు  ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. సమ్మెలో భాగంగా జిల్లాల్లోని డిపోల్లో కార్మికులు నిరసనలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడారు. కొన్నిచోట్ల బతుకమ్మ ఆడనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. చాలాచోట్ల కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. డిపోల వద్ద 144 సెక్షన్‌‌ అమలు చేస్తున్నారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ నేతలు వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నట్లు స్వచ్ఛందంగా ప్రకటించాయి.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంతంతే..!

ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నా అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. ఎక్కడి బస్సులు అక్కడే డిపోలకు పరిమితమవడంతో దసరా వేళ సొంతూళ్లకు వెళ్లేవాళ్లు నరకం అనుభవిస్తున్నారు. రైళ్లలో కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. హైదరాబాద్​ మెట్రో రైళ్లలోనూ ఇదే పరిస్థితి. తాత్కాలికంగా ప్రైవేటు డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు. డిపోల వద్ద భారీగా పోలీసులను ఉంచి.. వారి రక్షణ నడుమ బస్సులను బయటకు తీస్తున్నారు. సమ్మె కారణంగా ఎక్కడ వాటిని ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటారోనని జనం ఎక్కలేకపోతున్నారు. 11వేలకు పైగా వాహనాలను నడిపినట్లు అధికారులు తెలిపారు.  అందులో 3,327 ఆర్టీసీ బస్సులు, 2,032అద్దె బస్సులు, 6 వేలకు పైగా ప్రైవేట్‌‌ వాహనాలు, స్కూలు, కాలేజ్‌‌ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌‌లను నడిపించినట్లు వివరించారు.  తాత్కాలిక డ్రైవర్లకు రోజుకు 1500, కండక్టర్లకు  రోజుకు రూ. 1000 చొప్పున చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. కొన్నిచోట్ల ఇవ్వడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.

ప్రైవేటు దోపిడీ

ఆర్టీసీ సమ్మెతో ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌  అందినకాడికి దోచుకుంటున్నాయి. ప్రయాణికుల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి. రెండు, మూడు రెట్లు అధికంగా చార్జీలు తీసుకుంటున్నాయి. సికింద్రాబాద్​లోని జూబ్లీ బస్టాండ్​, హైదరాబాద్​లోని ఎంజీబీఎస్​ బస్టాండ్​ పరిసరాల్లో  ప్రైవేటు వెహికిల్స్​ జాతరను తలపిస్తున్నాయి. పది మందిని ఎక్కించుకోవాల్సిన వాహనాల్లో పదిహేను ఇరువై మందిని ఎక్కించుకొని వెళ్తున్నారు. సాధారణంగా నిజామాబాద్​కు సికింద్రాబాద్​ నుంచి బస్సు చార్జీ రూ. 100 నుంచి 150 వరకు ఉండగా.. ఇప్పుడు ప్రైవేటు ట్రావెల్స్ రూ. 500 దాకా వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. హైదరాబాద్‌‌లో క్యాబ్స్‌‌ అందినకాడికి దోచుకుంటున్నారు. వివిధ చార్జీల పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు. మౌలాలి నుంచి బాలాపూర్‌‌ వరకు రూ. 200 తీసుకోవాల్సి ఉండగా, రూ. 800 తీసుకున్నారని ఓ క్యాబ్​ కస్టమర్‌‌ వాపోయాడు.