
- కరీంనగర్ జిల్లా మన్నెంపల్లిలో ఎమ్మెల్యే రసమయిని నిలదీసిన మహిళలు
- త్వరలోనే కడతామని సర్ది చెప్పిన ఎమ్మెల్యే
తిమ్మాపూర్, వెలుగు : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్మండలంలోని మన్నెంపల్లిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను మంగళవారం మహిళా సంఘాలు అడ్డుకున్నాయి. 2016లో మహిళా సంఘ భవన నిర్మాణానికి శిలాఫలకం వేసినా ఇప్పటివరకు నిర్మించలేదు. మంగళవారం ఇతరులకు చెందిన రెండు బిల్డింగులతో పాటు మరో మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఎమ్మెల్యే వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మహిళలు ఆయనను అడ్డుకుని నిలదీశారు. తమ మహిళా సంఘ భవనానికి వేసిన శిలాఫలకం అలాగే ఉందని, మళ్లీ వేరే ప్రాంతంలో మరో మహిళా సంఘం బిల్డింగ్కు శంకుస్థాపన చేయడానికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. త్వరలోనే రెండు సంఘాల భవనాలను నిర్మిస్తానని ఎమ్మెల్యే సర్ది చెప్పడంతో శాంతించారు. సర్పంచ్ మేడి అంజయ్య, ఉప సర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఇనుకొండ జితేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్పాల్గొన్నారు.
మహిళలకు పోలీసుల వార్నింగ్
మధ్యాహ్నం ఎమ్మెల్యే గ్రామానికి వస్తున్నారన్న సమాచారం తెలుసుకుని పాత గ్రామపంచాయతీ వద్ద గుమిగూడగా.. పోలీసులు కేసులు పెడతామని బెదిరించారని మహిళలు వాపోయారు. ఎందుకు కేసులు పెడతారని అడిగితే దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది వీడియోలు, ఫొటోలు తీస్తుండగా ఫోన్లను గుంజుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఎమ్మెల్యే చెప్పినట్టు భవన నిర్మాణాలు ప్రారంభించకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని
హెచ్చరించారు.