లాక్డౌన్ భయంతో హైదరాబాద్‌ వదిలేసి ఊర్లకు పోతున్నజనం

లాక్డౌన్ భయంతో హైదరాబాద్‌ వదిలేసి ఊర్లకు పోతున్నజనం

లాక్‌ డౌన్‌ హైరానా
బైకులు, ఆటోలు, కార్ల మీద కూడా వెళ్లిపోతున్న తీరు
ఊరికి పోతే పదిలంగా ఉంటామన్న ఆశ
సిటీలోనే ఉండే వాళ్లు మాత్రం ‘లాక్‌ డౌన్‌’ ఏర్పాట్లతో బిజీ
సూపర్‌ మార్కెట్లు, కిరాణా షాపులకు క్యూ
సరుకుల రేట్లు పెంచేసిన వ్యాపారులు

మళ్లీ లాక్‌ డౌన్‌ పెట్టడంపై సీఎం ఆలోచన చేస్తున్నారనే వార్తలతో హైదరాబాద్‌ జనంలో హైరానా మొదలైంది. మళ్లీ అన్నీ బంద్ అయితే ఇబ్బందిపడాల్సి వస్తుందన్న ఆందోళన పెరిగింది. దీంతో చిన్న ఉద్యోగులు, కూలీలు, చిన్న చిన్న దుకాణాలు నడుపుకొనేవాళ్లు ఊర్లకు వెళ్లిపోతున్నారు. కరోనా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాకే తిరిగి హైదరాబాద్ వస్తామని అంటున్నారు. సోమవారం తెల్లారి నుంచే హైదరాబాద్లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు బిజీగా కనిపించాయి. సొంత, ప్రైవేటు వాహనాల్లోనూ జనం ఊరిబాట పట్టారు. ఇక ఇక్కడే ఉండేవాళ్లు లాక్డౌన్ ఏర్పాట్లలో పడ్డారు. నిత్యావసరాలు, ఇతర వస్తువులు కొనుక్కునేందుకు సూపర్ మార్కెట్లు, ఇతర షాపుల ముందు క్యూ కట్టారు. ఒకట్రెండు రోజుల కిందటిదాకా ఖాళీగా కనిపించిన వైన్ షాపుల ముందు కూడా క్యూలు కనిపించాయి. మళ్లీ లాక్ డౌన్ పెడితే తమ బతుకు ఏమవుతుందోనని చిన్నచిన్న దుకాణాలు, మెకానిక్ లు, ఇతర స్వయం ఉపాధి పనులు చేసుకునేవాళ్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో లాక్ డౌన్ పెడితే కనీసం తిండి కూడా దొరకదని, ఇక్కడ ఉండటం కంటే ఊరికి వెళ్లిపోవడమే మంచిదని చిన్న ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అందుకే సొంత ఊర్లకు వెళ్లిపోతున్నామని అంటున్నా రు. హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లు ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు సిటీ శివార్లలోని బస్టాండ్లలో సోమవారం తెల్లారి నుంచే రద్దీ ఎక్కువగా కనిపించింది. సిటీ నుంచి జిల్లాలకు వెళ్లేబస్సులు తిరిగే మెహిదీపట్నం, ఉప్పల్, ఎల్బీనగర్, బాలానగర్, సికింద్రాబాద్, ఆరాంఘర్, లింగంపల్లి, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో బస్టాండ్లన్నీ జనం రద్దీతో కనిపించాయి. నిన్నమొన్నటి వరకు ఖాళీగా తిరిగిన జిల్లా బస్సులు సోమవారం ఫుల్లుగా కనిపించాయి. ఇక కొందరు సొంత వెహికల్స్ పై, ఇంకొంత మంది ప్రైవేటు కార్లు మాట్లాడుకుని వెళ్తున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి రైల్వేస్టేషన్లలోనూ రద్దీ పెరిగింది.

అడ్డగోలుగా రేట్లు పెంచేశారు
మళ్లీ లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సర్కారు నుంచి ప్రకటన రావడంతో వ్యాపారులు నిత్యావసరాల రేట్లు ఒక్కసారిగా పెంచేశారు. 15 రోజులే లాక్ డౌన్ ఉంటుందన్న సంకేతాలు ఇస్తున్నా ఎందుకైనా మంచిదని చాలా మంది ఒకట్రెండు నెలలకు సరిపడా బియ్యం, నూనెలు, పప్పులు, ఇతర సరుకులు తీసుకెళ్తున్నారు. సోమవారం ఉదయం నుంచే హైదరాబాద్ లోని అన్నిసూపర్ మార్కెట్లు, హోల్ సేల్ షాపుల వద్ద జనాలు క్యూ కట్టారు. దుకాణాల్లో రేట్లు 5 నుంచి 20 శాతం వరకు పెంచి అమ్ముతున్నారు. అన్‌‌లాక్ తర్వాత కందిపప్పు కిలో రూ.90 నుంచి 95 మధ్యఉంటే.. నిన్నటినుంచి రూ.110పైగా బిల్లు వేస్తున్నారు. మినపపప్పు రూ.115 నుంచి రూ.130 కి, పెసర పప్పు రూ.120–130 నుంచి రూ.150 పైకి పెంచేశారు. నూనెల ధరలనూ పది ఇరవై రూపాయలు పెంచారు.

ఉద్యోగాలు వదిలి ఊర్ల బాట
లాక్‌ డౌన్‌ తొలిదశలో బాగా ఇబ్బందిపడ్డ చిరుద్యోగులు.. మళ్లీ ఆ పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నారు. ఉద్యోగాల్లేక, ఉన్నా జీతాలు సరిగా రాక, వచ్చిన డబ్బులు అవసరాలకు సరిపోక అవస్థలు పడ్డారు. ఇప్పుడిక చేసింది చాలనుకుంటూ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి ఊర్ల బాట పడుతున్నారు. అంతా బాగుంటే మళ్లీ తిరిగొద్దాం, లేకుంటే అక్కడే ఏదో రకంగా బతికేద్దామనే మొండితనంలో బస్సులు ఎక్కేస్తున్నారు. అన్‌ లాక్‌ మొదలయ్యాక వివిధ రాష్ట్రాల నుంచి తిరిగొచ్చిన సుమారు లక్షన్నర మంది వలస కార్మికులు మళ్లీ టెన్షన్‌ కు గురవుతున్నారు. కన్ స్ట్రక్షన్ తో పాటు వివిధ ఇండస్ట్రీల్లో పనిచేసే వీళ్లు ఇప్పుడెన్ని రోజులు లాక్‌డౌన్‌ ఉంటుందోనని టెన్షన్‌ పడుతున్నారు. ఇంతకుముందే తిండి, నీళ్లు లేక, డబ్బు దొరక్క అవస్థలు పడి.. వందలు, వేల కిలోమీటర్లు నడిచి సొంతూర్లకు వెళ్లారు. అన్‌ లాక్‌ మొదలయ్యాక తిరిగొస్తే.. ఇప్పుడు మళ్లీ లాక్డౌన్ టెన్షన్‌ మొదలైంది. మరోవైపు ఇప్పటికే కన్ స్ట్రక్షన్ రంగం సంక్షోభంలో ఉందని.. మళ్లీ లాక్ డౌన్ పెడితే నడిచే ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా బతుకెట్ల ?
లాక్ డౌన్ సడలింపుల తర్వాత ఈ నెల మొదటి నుంచే షాపులు తెరిచారు. చిన్న వ్యాపారులు, మెకానిక్ లు, స్వయం ఉపాధి పనులు చేసుకునే వారికి కాస్త ఆదాయం వస్తోంది. ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ పెడితే ఏం చేయాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడిప్పుడే వ్యాపారం కొద్దిగా పుంజుకుంటుందని, అంతలోనే లాక్ డౌన్ పెడితే షాపుల కిరాయిలు ఎలా కట్టాలని, పనిచేసే వాళ్లకు జీతాలు ఎట్లాఇవ్వాలని, ఇంటి ఖర్చులు ఎలా వెళ్లదీయాలని వ్యాపారులు వాపోతున్నారు. కరోనా కట్టడికి సర్కారు వేరే ప్రత్యామ్నాయాలు వెదికితే మంచిదని, మళ్లీలాక్ డౌన్ పెడితే లక్షల కుటుంబాలకు పని లేకుండా పోతుందని విద్యానగర్ కు చెందిన ట్రావెల్స్ యజమాని వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు.

లిక్కర్ షాపుల దగ్గర క్యూలు..
ఇంతకుముందు ఒక్కసారిగా లాక్ డౌన్ విధించడంతో లిక్కర్ అలవాటు ఉన్నవాళ్లు అల్లాడారు. కొందరు బ్లాక్‌లో ఐదారు రెట్లు ఎక్కువ ధరకు కొన్నారు. ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ పెడ్తారనే ప్రచారంతో ఆదివారం సాయంత్రం నుంచే వైన్ షాపుల వద్ద క్యూలు మొదలయ్యాయి. చాలా మంది బాటిళ్లకు బాటిళ్లు కొనుగోలు చేశారు. చాలా వైన్‌ షాపుల్లో ఫుల్‌ బాటిళ్ల స్టాక్‌ లేకుండా పోయింది. చేతిలో డబ్బుల్లేని వాళ్లు.. అప్పు చేసి మరీ లిక్కర్ కొనడం కనిపించింది. సాధారణంగా గ్రేటర్‌ హైదరాబాద్లో రోజుకు సగటున 30 కోట్ల దాకా లిక్కర్ స్టాక్ తరలిస్తుంటారు. సోమవారం సాయంత్రం కాకుండానే 35 కోట్ల వరకు స్టాక్‌ డిపోల నుంచి తరలించారు.

ఇప్పటికే బాధలుపడ్డ..
మాది కర్నాటకలోని హుమ్నాబాద్. హైదరాబాద్ సిటీలో నాలుగేండ్లుగా హమాలీ పనిచేసుకుంటున్న. మొన్న లాక్ డౌన్ టైంలనే ఇక్కడ ఇరుక్కపోయి చాలా ఇబ్బంది పడ్డ . లాక్ డౌన్ ఓపెన్ చేసినంక పని దొరికింది. మళ్లీ లాక్ డౌన్ చేస్తున్నరన్న వార్తలు చూసి ఫ్యామిలీతో ఊరికి
వెళ్లిపోతున్నం.
– రమేశ్, హమాలి

ఊర్లనే పని చేసుకుంట..
నారాయణపేట నుంచి వచ్చి హైదరాబాద్ లో లేబర్ పనిచేస్తున్న. మళ్లీ లాక్ డౌన్ అంటుండటంతో పెడ్లాంపిల్లతో ఊరికి పోతున్న. ఇక్కడ ఉంటే తిండికి, ఇంటి కిరాయికి ఇబ్బంది పడాల్సి వస్తది. అందుకనే పోతున్నం. ఊర్లనే ఏదో ఒక పనిచేసుకుంట బతికేస్తం.
– వీరేశం, అడ్డా కూలీ

ఈ రోజు ప్యాసింజర్లు పెరిగారు
లాక్ డౌన్ ఎత్తేసినప్పటి నుంచి హైదరాబాద్ నుంచి జిల్లాలకు బస్సులు నడుస్తున్నయి. మెహిదీపట్నం నుంచి రోజూ120 సర్వీసులు జిల్లాలకు వెళ్తుంటయి. ఇప్పటిదాకా బస్సుల్లో చాలా తక్కువ మంది ప్యాసింజర్లే ఎక్కుతున్నారు. సోమవారం మాత్రం ప్యాసింజర్ల సంఖ్య బాగా పెరిగింది.
– ఎల్బీ ముత్యాలు, మెహిదీపట్నం
ఆర్టీసీ పాయింట్ కంట్రోలర్

For More News..

రాష్ట్రంలో 2648 మందికి టెస్టులు.. అందులో 975 పాజిటివ్