‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ విజయవంతం..పెండింగ్లో ఉన్న లక్షకు పైగా ప్రభుత్వ ఫైళ్ల పరిష్కారం

‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ విజయవంతం..పెండింగ్లో ఉన్న లక్షకు పైగా ప్రభుత్వ ఫైళ్ల పరిష్కారం

హైదరాబాద్​, వెలుగుఈ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ప్రజా పాలన–-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు గ్రామాలు, పట్టణాల్లో వివిధ అంశాలపై ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 12,758 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు, 3,175 మున్సిపల్ వార్డుల్లో వార్డు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 1,06,598 ప్రభుత్వ ఫైళ్లను అధికారులు పరిష్కరించారు.

అలాగే జిల్లా స్థాయిలో 32,451 మంది లబ్ధిదారులకు ఆస్తుల మంజూరు ప్రక్రియ పూర్తి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 99 రోజుల కార్యాచరణలో ప్రజారోగ్యం, రోడ్డు భద్రత, సంక్షేమం, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిమ్స్‌లో రూ.30 కోట్లతో లినాక్ సదుపాయం, ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య సంస్థలో రూ.24 కోట్లతో నిర్మించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బ్లాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

రోడ్డు భద్రత కోసం 4,512 గ్రామ రహదారి భద్రత కమిటీలను ఏర్పాటు చేయగా, ప్రమాదాలకు అవకాశం ఉన్న 548 బ్లాక్‌స్పాట్లను గుర్తించి చర్యలు చేపట్టారు. వ్యవసాయ రంగంలో 32,818 మంది రైతులు రుణమేళాల్లో పాల్గొన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.6 కోట్లతో నిర్మించిన 50 అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించారు. అలాగే 7,292 గ్రామాల్లో స్త్రీశక్తి భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు నిర్వహించారు.