ఇద్దరు కొడుకులున్నా..తిండి పెడ్తలే..ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ

ఇద్దరు కొడుకులున్నా..తిండి పెడ్తలే..ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ
  • అక్రమ భూ పట్టాను రద్దు చేయాలని, ఆక్రమణల నుంచి ప్రభుత్వ భూమి కాపాడాలని దరఖాస్తులు
  • ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలని, ఉపాధి కల్పించాలని వేడుకోలు
  • సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ల హామీ
  • దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం 

మంచిర్యాల/నస్పూర్/ నిర్మల్/ ఆసిఫాబాద్/ ఆదిలాబాద్ టౌన్, వెలుగు: మున్సిపల్​ఎన్నికల తర్వాత జరిగిన మొదటి  ప్రజావాణికి భారీ స్పందన లభించింది. సోమవారం కలెక్టరేట్లలో జరిగిన ప్రజావాణికి ప్రజలు భారీగా తరలివచ్చి తమ సమస్యలు చెప్పుకొని కలెక్టర్లకు దరఖాస్తులు అందజేశారు. ఇద్దరు కొడుకులున్నా తిండి పెట్టడం లేదని, పైగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని, వారినుంచి ప్రాణహాని ఉందని మందమర్రి దీపక్​నగర్​కు చెందిన ఇమ్మడిశెట్టి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం మంచిర్యాల కలెక్టరేట్​లో జరిగిన గ్రీవెన్స్​లో కలెక్టర్​కు మొరపెట్టుకున్నాడు.

సత్యనారాయణ, సుశీల దంపతలకు విజయ్​కుమార్, శ్రావణ్​కుమార్​ఇద్దరు కొడుకులున్నారు. పెద్ద కొడుకు ప్రైవేట్​ జాబ్​ చేస్తుండగా, చిన్న కొడుకు బెల్లంపల్లి 2టౌన్​ పోలీస్​స్టేషన్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్నాడు. వృద్ధులైన తల్లిదండ్రులను కొడుకులు పట్టించుకోవడం లేదని, తిండి పెట్టడం లేదని, బట్టలు కూడా ఇవ్వడం లేదని సత్యనారాయణ వాపోయాడు. తన పేరిట ఉన్న భూమి అమ్మగా వచ్చిన రూ.30 లక్షలు తీసుకోవడమే గాకుండా, తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, వారినుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. 

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి

జైపూర్ మండలం కుందారంలోని ఝాన్సీ గ్రామైక్య సంఘం వీవోఏ మౌనిక మహిళా సంఘాలకు సంబంధించిన రూ.18 లక్షలను గోల్​మాల్​చేశారని కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. స్ర్తీనిధి నుంచి తీసుకున్న లోన్లు పూర్తిగా చెల్లించినప్పటికీ ఇంకా రూ.18 లక్షలు బాకీ ఉన్నట్టుగా చూపుతోందన్నారు. నెన్నెల మండల కేంద్రానికి చెందిన రైతులు తమకు 2007లో ఇచ్చిన భూమిలో తాము సాగు చేసుకుంటున్నామని, డిజిటల్ పాస్ పుస్తకాలు ఇప్పించాలని కోరారు.

భీమారం మండలం ఆరేపల్లికి చెందిన రెడ్డి చిన్న రాజయ్య తన భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకున్నారని, ఆ పట్టాను రద్దుచేసి తిరిగి తనకు భూమిని అప్పగించాలని కోరారు. బెల్లంపల్లి మండలం గంగారం నగర్ బస్తీకి చెందిన చిప్ప హరీశ్ పట్టణంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని వ్యాపారం కొనసాగిస్తున్నారని, వెంటనే స్పందించి భూమిని కాపాడాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. మొత్తం 49 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు      

 ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేయవద్దని, తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ ​కలెక్టర్ కె.హరిత సూచించారు. కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. జైనూర్ మండలం పార గ్రామానికి చెందిన సిడ్మారావు తన వ్యవసాయ చేనులో బావి మంజూరు చేయాలని, రెబ్బెనకు చెందిన ఎల్కరి పద్మ, మండలంలోని రాళ్లపేటకు చెందిన రెడ్డి ఉమారాణి తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారు. ఆసిఫాబాద్​లోని సందీప్ నగర్​కు చెందిన బోయని నాగేశ్ తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం జారీకి చేయాలని, చింతల మానేపల్లి మండలం కింద గ్రామానికి చెందిన రైతు తన భూమిని ఇతరులు పట్టా చేసుకున్నారని చర్యలు తీసుకోవాలని అర్జీ సమర్పించారు. 

దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, మండలాల వారీగా పెండింగ్​లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ స మస్యలకు సంబంధించి 90 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, జడ్పీ సీఈవో శంకర్, అధికారులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ ​ప్రజావాణిలో 98 దరఖాస్తులు

ప్రజావాణిలో స్వీకరించే అర్జీలను అధికారులు పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదిలాబాద్​కలెక్టర్​ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, ఉపాధి హామీ పనులు, భూభారతి సమస్యలు తదితర అంశాలకు సంబంధించి మొత్తం 98 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, జడ్పీ సీఈఓ, డీఆర్డీఓ రవీందర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు