ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య కూడా ధరణి బాధితుడే

ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య కూడా ధరణి బాధితుడే
  • తన రెండెకరాల భూమి ధరణిలో చూపించడం లేదని రెండేండ్లుగా తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే
  • సెక్రటేరియెట్​లో రెవెన్యూ మంత్రిని కలిసి పరిష్కరించాలని వినతి
  • ప్రజావాణిలో ధరణి భూ సమస్యల ఫిర్యాదులే ఎక్కువ

హైదరాబాద్, వెలుగు: ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ప్రజా నాయకుడు గుమ్మడి నర్సయ్యకూ ధరణి తిప్పలు తప్పలేదు. తన 2 ఎకరాల భూమి ధరణిలో చూపించడం లేదని రెండేండ్ల నుంచి ఆయన ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. కొత్త ప్రభుత్వం రావడంతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని కలిసేందుకు శుక్రవారం ఆయన సెక్రటేరియెట్​కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘వెలుగు’తో మాట్లాడారు. ‘‘నా రెండెకరాల భూమికి సంబంధించి ధరణిలో సమస్య వస్తే రెండేండ్ల నుంచి తిరుగుతున్న. ఎక్కడికి వెళ్లినా పరిష్కారం దొరకలేదు. మా మంత్రిని కలిసి నా భూమి సమస్యను చెప్పిన.. పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు’’ అని ఆయన తెలిపారు. 

తప్పుల సవరణ జరగట్లేదు..

ప్రస్తుతం ధరణిలో తప్పుల సవరణకు వచ్చిన అప్లికేషన్లపై సందిగ్ధం నెలకొన్నది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ధరణిలో అగ్రికల్చర్ ​భూముల అమ్మకాలు, కొనుగోళ్లు తప్ప తప్పుల సవరణకు కోసం వివిధ మాడ్యుల్స్​ కింద వచ్చిన అప్లికేషన్లు కలెక్టర్ల లాగిన్​లలోనే పెండింగ్​లో పడిపోతున్నాయి. సీసీఎల్ఏలోనూ లక్షల్లో అప్లికేషన్లు అప్రూవల్ ​కోసం పెండింగ్​లో ఉన్నాయి. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్​ పార్టీ ధరణి స్థానంలో భూమాత తీసుకువస్తామని హామీ ఇచ్చింది. ఇటీవల సీఎం రేవంత్​ ధరణిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించగా, ధరణిలో తప్పుల తడక, గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల గోల్​మాల్​పై సీరియస్​అయ్యారు. పోర్టల్ ​నిర్వహించే కంపెనీపై కూడా రిపోర్ట్​అడిగారు. దీంతో అప్పటి నుంచి ధరణిలో ట్రాన్సాక్షన్స్ నిలిచిపోయాయి. సర్కార్​ ఐఏఎస్​ అధికారుల బదిలీ చేపడుతుందన్న సమాచారంతో తమకెందుకు ఇబ్బందని కలెక్టర్లు ధరణిని పట్టించుకోవడం మానేశారు. ధరణి వ్యవహారంలో గతంలో రియల్ భూమ్​ ఉన్న జిల్లాల్లో పనిచేసిన ఇద్దరు కలెక్టర్లపైనా చర్యలు తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలిసింది.

బయటకొస్తున్న సమస్యలు..

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజావాణి నిర్వహించడంతో ధరణి సమస్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రజా భవన్​లో వారంలో రెండు రోజులు నిర్వహిస్తున్న ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుల్లో రెవెన్యూ సమస్యలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవల సీఎం రేవంత్​ ధరణి పోర్టల్​పై సమీక్ష నిర్వహించారు. పోర్టల్​తో పాటు రైతుల సమస్యలు తీరేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నివేదిక ఇవ్వాలని  అధికారులను ఆదేశించారు.