సెప్టెంబర్ 6న జీపీల ఓటర్ లిస్ట్ పబ్లిష్

సెప్టెంబర్ 6న జీపీల ఓటర్ లిస్ట్ పబ్లిష్
  • వారం రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ
  • 21న తుది ఓటర్ జాబితా
  • రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ లిస్ట్ తయారీ, పబ్లిష్ కు రాష్ర్ట ఎన్నికల సంఘం ( ఎస్ ఈ సీ ) బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.  ఈ షెడ్యూల్ ప్రకారం.. వచ్చే నెల 6న ఎంపీడీవోలు, డీపీవోలు ఓటర్ లిస్ట్ రెడీ చేసి ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ డ్రాప్ట్ ఓటర్ లిస్ట్ పై 9,10 తేదీల్లో వివిధ రాజకీయ పార్టీలతో జిల్లా, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి సలహాలు , సూచనలు స్వీకరించనున్నారు. 7వ తేదీ నుంచి 13 వరకు ఓటర్ లిస్ట్ పై పబ్లిక్ నుంచి అభ్యంతరాలను స్వీకరించి 19లోగా పరిష్కరించనున్నారు. వచ్చే నెల 21న వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా తుది ఓటర్ లిస్ట్ ను  పబ్లిష్ చేయనున్నారు. 

లిస్ట్ పై వచ్చే నెల 29న కలెక్టర్లు, లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్లు, డీపీవోలతో  ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. బుధవారం పంచాయతీ రాజ్ సెక్రటరీ లోకేశ్ కుమార్, కమిషనర్ అనితా రాంచంద్రన్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అడిషనల్ డీజీ సంగ్రామ్ లతో ఎసీఈ సీ కమిషనర్ పార్థసారథి, సెక్రటరీ అశోక్ కుమార్ సమావేశమయ్యారు.  జీపీ ఎన్నికల నిర్వహణ పై డీపీవోలు, ఎంపీడీవోలు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కమిషనర్ ఆదేశించారు.  టీపోల్ యాప్ లో సాఫ్ట్ వేర్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సీజీజీకి స్పష్టం చేశారు.