పుదుచ్చేరి: రంజీ ట్రోఫీలో హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్‌ను కూడా డ్రాతో సరిపెట్టుకుంది. పుదుచ్చేరితో గ్రూప్–డి మ్యాచ్ డ్రాగా ముగియగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో హైదరాబాద్ మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 92/8తో చివరి రోజు, మంగళవారం ఆట కొనసాగించిన పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్‌లో 126 రన్స్‌కే ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ నాలుగు, పున్నయ్య మూడు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం ఫాలోఆన్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పుదుచ్చేరి మ్యాచ్ చివరకు 42 ఓవర్లలో 97/5 స్కోరు చేసి ఓటమి తప్పించుకుంది. తనయ్, అనికేత్ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రాహుల్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. శనివారం మొదలయ్యే తమ తర్వాతి మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్‌తో హైదరాబాద్ పోటీ పడనుంది.
