
పానుగల్ వెలుగు: వనపర్తి జిల్లాలోని పానుగల్ ఖిల్లాలో క్రీ.శ.13,14వ శతాబ్దాల నాటి అరుదైన ‘ పులివేట వీరగల్లు’ ప్రతిమను తెలంగాణ చరిత్ర పరిశోధక బృందం గుర్తించింది. ఆ విగ్రహానికి కుడివైపు సిగ, తలపై పాగా, మెడలో కంటె, వీరకాసెతో కనిపించే వీరుడు రెండు చేతుల బల్లెంతో పులిని చంపుతున్నట్టు రాతి పలకపై ఉల్బణ(ఉబ్బెత్తు) శిల్పంగా చెక్కబడింది. దాదాపు నాలుగు అడుగుల ఎత్తైన పులివేట వీరగల్లు విగ్రహాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు బైరోజు చంద్రశేఖర్, శ్యామ్ సుందర్ ఆదివారం మాట్లాడుతూ.. పులులు, అడవి పందుల బారి నుంచి గ్రామ ప్రజలను రక్షించే వీరుడు వీరగల్లు అని పేర్కొన్నారు.
పులులు, అడవిపందులతో పోరాడుతూ అమరులైనవారికి జ్ఞాపకంగా విగ్రహాలను ఊరి పొలిమేరలో ఏర్పాటు చేసుకుని వారి శౌర్యాన్ని గుర్తు చేసుకొని కీర్తించేవారని చరిత్ర ద్వారా తెలుస్తుందని వివరించారు. జిల్లా కేంద్రానికి 15కి.మీ దూరంలోని పానుగల్ గిరిదుర్గానికి ప్రాచీన చరిత్ర ఉందని, ఆ కోటలోని కట్టడాలు, ఫిరంగులతో పాటు ఎన్నో శిల్పాలు, వీరగల్లు విగ్రహాలు ఉన్నాయని చెప్పారు. కోటలోకి వెళ్తుంటే ముళ్లగవిని ప్రదేశం వద్ద అరుదైన వీరగల్లు విగ్రహం ప్రతిష్టించి ఉందని తెలిపారు. పులివేట వీరగల్లు ప్రతిమ మరొకటి మండలంలోని బుసిరెడ్డిపల్లిలో కూడా ఉందని చెప్పారు.
ఇవి అరుదైన వీరగల్లు విగ్రహాలని, ఇలాంటివి రాష్ట్రంలో నిజామాబాద్, భువనగిరి, ఖమ్మం, వరంగల్, నిర్మల్ జిల్లాల్లో కూడా కనిపిస్తాయని పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో పులివేట వీరగల్లు ఉండడం ఇక్కడి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యమని వివరించారు. వీటిని భద్రపరచాలని లేదా ఏదేని మ్యూజియానికి చేర్చాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పానుగల్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.