పప్పులు, నూనె గింజల సాగుకు ప్రోత్సాహమేది?

పప్పులు, నూనె గింజల సాగుకు ప్రోత్సాహమేది?

సంగారెడ్డి, వెలుగు : నూనె గింజలు, పప్పు దినుసుల ఉత్పత్తులకు సంగారెడ్డి ఒకప్పుడు పెట్టింది పేరు.  కానీ సరైన ప్రోత్సాహం లేక పప్పుదినుసుల సాగు పడిపోతోంది. ప్రతిఏటా విత్తనాలు, ఎరువులు, మార్కెటింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఈ పంటల సాగు గణనీయంగా తగ్గుతోంది. 2020 వాన కాలంలో పెసర పంట 42.352 ఎకరాలు, 2021లో 38,500 ఎకరాల్లో పండించగా, ఈసారి 1,760 ఎకరాలు మాత్రమే అంచనా వేశారు.  కంది 2020లో 52,142 ఎకరాలు, 2021లో లక్షా 10 వేల ఎకరాలు పండించగా, ఈసారి 4,320 ఎకరాల్లో సాగు కానుందని భావిస్తున్నారు. మినుము 2020లో 24,645 ఎకరాలు, 2021లో లక్షా 35 వేల ఎకరాలు, ఈసారి 960 ఎకరాలు మాత్రమే సాగు కానుందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే గతేడాదిలో కొంతకాలం పెసర, మినుములకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులకు మద్దతు ధర లభించింది. దాంతో ఆయా పంటల సాగు పెరిగింది. కానీ ఈసారి మాత్రం ఆఫీసర్ల అంచనాల్లో నూనె గింజలు, పప్పుదినుసులకు సంబంధించిన అన్ని రకాల పంటల సాగు తక్కువగానే ఉంది. 

సారవంతమైన నేలలు
జిల్లాలో పప్పు దినుసుల ఉత్పత్తికి జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలు సారవంతమైన నేలలుగా ప్రసిద్ధి చెందాయి. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని మండలాల్లో కందులు, మినుము, పెసర పంటలు ఎక్కువగా పండిస్తారు. ఈ పరిస్థితి సంగారెడ్డి, పటాన్ చెరు, అందోల్ నియోజకవర్గాల్లో పెద్దగా కనిపించదు. ఈ క్రమంలో పంటల మార్పిడి కోసం ప్రయత్నించే రైతులను వ్యవసాయ శాఖ ప్రోత్సహించి తగిన సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఇలాంటి ప్రయత్నాలు జరగడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పప్పు దినుసులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచినప్పటికీ ఆ దిశగా స్థానికంగా మార్కెటింగ్ వ్యవస్థ సరిగా లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. 

మాటల్లో ఓకే.. చేతల్లో నిల్​
పొద్దుతిరుగుడు, పల్లి ఇతరత్రా నూనె గింజలు, పప్పు దినుసుల ఉత్పత్తిని పెంచాలన్న ప్రభుత్వ ఆలోచనలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. అందుకు తగ్గ ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో పంటల మార్పిడిపై రైతులు పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. పప్పు దినుసులు, నూనెగింజల సాగు పెంచితే అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి హరీశ్​రావు చెబుతున్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఎస్సీ, ఎస్టీ, సన్నకారు రైతులకు కంది విత్తనాలు ఉచితంగా ఇస్తామని మంత్రి వెల్లడించినా గతేడాది జిల్లాకు కేటాయించిన 554 క్వింటాళ్ల ఉచిత కంది విత్తనాలు జూలై వరకు 50 శాతమే అందాయి. ఈసారి అదే పరిస్థితి రిపీట్ అయితే పప్పు దినుసుల పంటలను నమ్ముకున్న కొద్ది మంది రైతులు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు విత్తనాలు అందుబాటులో ఉంచి, మార్కెటింగ్​ సమస్యలు తీరిస్తే తప్ప పప్పులు, నూనె గింజల సాగు 
పెరిగే చాన్స్​ లేదు. 

అమ్మేందుకు ఇబ్బందులు... 
గతేడాది ఐదెకరాల్లో మినుములు, పెసర, కందులు వేశాను. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు చాలా ఇబ్బందులు పడ్డాను. ఈ పంటలు లాభసాటిగా ఉంటాయని కష్టాలకు ఓర్చి సాగు చేస్తే కొనుగోలు కేంద్రాలు లేక అమ్మకాల టైంలో ఇబ్బందులు పడ్డాను. పప్పు దినుసులు వేయమంటున్న అధికారులు కనీసం ఈసారైనా అందుకు తగ్గట్టు మార్కెటింగ్ సౌకర్యం  కల్పించాలె. 
- పెంటయ్య, రైతు, ఆత్మకూర్

సరైన ప్రోత్సాహం లేదు.. 
గతేడాది ఆరు ఎకరాల్లో కంది పంట వేశాను. రెండు ఎకరాల్లో మినుము వేశాను. మార్కెటింగ్ సౌకర్యం లేక చాలా రోజులు పంట కోయలేదు. చివరికి అకాల వర్షాలతో పంట పాడై నష్టం వచ్చింది. ఈసారి పప్పు దినుసుల జోలికే వెళ్లొద్దనిపిస్తోంది. సరైన టైంలో విత్తనాలు, ఎరువులు లభించి మార్కెటింగ్ మెరుగుపడితే చాలా మంది రైతులు పప్పు దినుసుల పంటలకు మొగ్గు చూపిస్తారు.  -- విష్ణువర్ధన్ (రైతు, లింగాపూర్)