పుల్వామా దాడి ప్లాన్ చేసిన మాస్టర్ మైండ్ హతం

పుల్వామా దాడి ప్లాన్ చేసిన మాస్టర్ మైండ్ హతం

ఫిబ్రవరి 14న పుల్వామాలో CRPF కాన్వాయ్ పై జరిగిన దాడి మాస్టర్ మైండ్ ముదసిర్ ను భద్రతా బలగాలు చంపేశాయి. నిన్న త్రాల్ జిల్లా లోని పింగ్లిష్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముదసిర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహమ్మద్ భాయ్ చనిపోయినట్టు ఆర్మీ ప్రకటించింది. అతడి శవాన్ని తల్లిదండ్రులు కూడా గుర్తు పట్టారని… పూడ్చిపెట్టడం కూడా పూర్తైందని ఆర్మీ చైనార్ కార్ప్స్ కమాండర్ KJS ధిల్లాన్ తెలిపారు. గత 21 రోజుల్లో మొత్తం 18 మంది ఉగ్రవాదులను హతమార్చామని. అందులో 14 మంది జైషే మొహమ్మద్ కు చెందినవారని తెలిపారు. పుల్వామా దాడి మాస్టర్ మైండ్ ముదసిర్ అహ్మద్ ఖాన్… జైషే మొహమ్మద్ సెకండ్ కమాండర్ గా పనిచేస్తున్నాడని చెప్పారు.

పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్ లోని పింగ్లిష్ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో నిన్న సాయంత్రం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి భధ్రతా బలగాలు. ఓ ఇంట్లో నక్కిన ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. నిన్న సాయంత్రం నుంచి ఉగ్రవాదులు-బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ఘటనాస్థలంలో రెండు ఏకే -47 రైఫిల్స్, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరు పుల్వామా దాడి మాస్టర్ మైండ్ ముదసిర్ అహ్మద్ ఖాన్ గా గుర్తించారు.