వర్షాలకు దెబ్బతిన్న పునాస పంటలు 

వర్షాలకు దెబ్బతిన్న పునాస పంటలు 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా నాలుగైదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పునాస పంటలు దెబ్బతిన్నాయి. పత్తి చేన్లు జాలు పట్టిపోగా, వరి నార్లు మొత్తం మురిగిపోతున్నాయి. ఈ సీజన్‌‌లో ఇప్పటి వరకు 55 లక్షల పైగా ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ప్రధానంగా పత్తి, మక్క, సోయా, పెసర, కంది, మినుములు, వరి పంటలన్నీ మొలకల దశలోనే ఉన్నాయి. ఈ టైమ్ లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో పంటలన్నీ పాడైపోతున్నాయి. ముఖ్యంగా పత్తిపై ఎక్కువ ప్రభావం పడింది. చేన్లలో నీళ్లు నిలిచి ఇటీవల వేసిన విత్తనాలు మురిగిపోతున్నాయి. ఇప్పటికే మొలిచినవీ ఖరాబైపోతున్నాయి. ఇక ఈ వానాకాలంలో 45 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని  వ్యవసాయ శాఖ టార్గెట్‌‌ పెట్టింది. ఇప్పటికే 2లక్షలకు పైగా ఎకరాల్లో నాట్లు వేశారు. మిగిలిన లక్షలాది ఎకరాల్లో వరి సాగు చేసేందుకు రైతులు నార్లు పోశారు. కానీ ఎడతెరిపి లేని వర్షాలకు నారు మళ్లలో నీరు నిలిచింది. దీంతో నారంతా మురిగిపోతోంది. దాదాపు 25 లక్షల ఎకరాల్లో సాగుకు సరిపడేంత నారు వృథా అయిందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. దెబ్బతిన్న పత్తి పంటను తొలగించి మళ్లీ విత్తనాలు వేయాల్సిందేనని, మళ్లీ దున్నీ కొత్తగా నారు పోయాల్సిందేనని రైతులు వాపోతున్నారు. దీంతో డబుల్ ఖర్చవుతుందని రైతులు 
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నారు మళ్లా పోసుడే.. 

9 ఎకరాల్లో వరి వేసేందుకు బస్తాకు రూ.800 చొప్పన 9 బస్తాల నారు పోసిన. కానీ నారు పోసిన కాన్నుంచి వానలు పడ్తూనే ఉన్నయ్. పొలంల నీళ్లు నిలవడంతో నారంతా మురిగిపోతంది. రూ.10 వేలు మీద పడ్డయ్. ఇప్పుడు మళ్లా నారు పోసుకోవాల్సిందే.  
- సమ్మెట శ్రీను, గూడురు మండలం, మహబూబాబాద్‌‌ జిల్లా

పత్తి చేన్లు దెబ్బతిన్నయ్..   

వానలతో పత్తి చేన్లు దెబ్బతిన్న య్. నీళ్లు నిలిచి మొలకలన్నీ మురిగిపోతున్నయ్. నేను పత్తి వేసి 17 రోజులైంది. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన పడ్తంది. ఇంకో మూడ్రోజు లు ఇట్లనే ఉంటే పంటంతా ఖరాబైతది. మొలవని, మురిగిపోయిన వాటి స్థానంలో మళ్లీ విత్తనాలు వేయాల్సిందే. 
- గుండా రవి, రామకృష్ణాపురం, వరంగల్‌‌ జిల్లా