న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తయారీకి ప్రభుత్వం ఓ పుణే బేస్డ్ కంపెనీకి నిధులను ఇవ్వనుంది. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం ప్రభుత్వం నుంచి ఫండ్స్‌ను అందుకుంటున్న మొదటి కంపెనీ ఇదే కావడం విశేషం. కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం పుణేకి చెందిన సీగల్ బయో సొల్యూషన్స్‌కు ఫండ్స్ అందించనున్నామని యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ పేర్కొంది. ఈ కంపెనీ తన ఫేజ్ 1 ట్రయల్స్‌ను ఇంకో 18-–20 నెలల్లో ప్రారంభిస్తుందనే అంచనాలున్నాయి. సింప్టమ్స్ లేకపోయినప్పటికి బాధితులలో ఈ వైరస్‌ను గుర్తించడానికి కంపెనీ హోం టెస్ట్ కిట్స్‌ను తయారు చేయనుంది. ఈ రెండింటి కోసం యాక్టివ్ విరోసమ్ టెక్నాలజీ(ఏవీటీ)ని వాడనుంది. ఈ టెక్నాలజీ ద్వారా శరీరంలోని యాంటీబాడీస్‌ను ప్రేరేపించడానికి ఏవీ ఏజెంట్లను వాడతారు. వీటి సామర్ధ్యాన్ని టెస్ట్ చేయడానికి ముందుగా ఎలుకలపై కంపెనీ ప్రయోగించనుంది. ఎబోలా, జికా, చికున్‌గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులకు వ్యాక్సిన్ తయారు చేయడానికి ఈ ఏవీటీ ప్లాట్‌ఫార్మ్‌ను వాడామని కంపెనీ ఫౌండర్ విశ్వాస్ జోషి అన్నారు.
