- లాక్ డాన్ రూల్స్ బ్రేక్ చేసిన సిగరెట్ల డీలర్ పై కేసు నమోదు
పుణె: మహారాష్ట్రలోని పుణెలో రూ.39 లక్షలు విలువైన సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ ఉల్లంఘించి సిగరెట్లు సప్లయ్ చేస్తున్న డీలర్ పై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఎస్ఐ నీలేశ్ కుమార్ గురువారం వెల్లడించారు. కోరెగావ్ పార్క్ ఏరియాలోని డీలర్ సిగరెట్లు సప్లయ్ చేస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. ఒక కస్టమర్ ను డీలర్ దగ్గరకు పంపినట్లు చెప్పారు. కార్టన్ సిగరెట్లను డబుల్ రేటుకు ఇచ్చేందుకు డీలర్ ఒప్పుకున్నాడన్నారు. గోడౌన్ దగ్గర డబ్బులు తీసుకుని కార్టన్ సిగరెట్లు ఇవ్వగానే దాడి చేసినట్లు చెప్పారు. డీలర్ పై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. అయితే డీలర్ ను అరెస్టు చేయలేదని లాక్ డౌన్ తర్వాత విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసినట్లు చెప్పారు. లాక్ డౌన్ అమలులో ఉన్నందున కేవలం నిత్యావసర వస్తువుల సరఫరాకు మాత్రమే పర్మిషన్ ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పుణె డీసీపీ బచ్చన్ సింగ్ స్పష్టం చేశారు.
