పోలీసు అధికారిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లాడు

పోలీసు అధికారిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లాడు

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌లెవ‌రూ రోడ్ల‌పైకి రావొద్ద‌ని, మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌కండ‌ని పోలీసులు ఎంత చెప్పినా.. కొంద‌రు మాత్రం మాట విన‌ట్లేదు. లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ.. పోలీసుల‌పైనే వ్య‌తిరేకంగా దారుణాల‌కి పాల్ప‌డుతున్నారు. పంజాబ్ లోని జలంధ‌ర్ లో ఇలాంటి ఓ ఘ‌ట‌న జ‌రిగింది. లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు విధులు నిర్వహిస్తోన్న పోలీసు అధికారిపై ఓ ఆక‌తాయి తన కారుతో గుద్ది కొద్ది దూరం వ‌ర‌కూ ఈడ్చుకెళ్లాడు. అది గ‌మ‌నించిన ఇత‌ర పోలీసులు కారును వెం‌బ‌డించి ఆ ఆధికారిని ర‌క్షించారు.

జలంధర్‌ ప్రాంతంలోని మిల్క్‌బర్ చౌక్ వద్ద లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి కారులో ఓ యువకుడు రోడ్డుపైకొచ్చాడు. ఓ పోలీసు అధికారి అతని కారుకు అడ్డంగా నిలుచుని కారును ఆపాలని సూచించాడు. కానీ ఆ ఆక‌తాయి కారు ఆపకపోవడమే కాకుండా ఆయనపైకి కారును తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో కారు ముందు భాగంపై ఆ పోలీసు అధికారి ఎగిరిపడ్డాడు. అయినా కారును ఆపకుండా అలాగే కొన్ని మీటర్లు ముందుకు పోనిచ్చాడు. వెంటనే అక్కడున్న ఇతర పోలీసులు ఆ కారును వెంబడించారు. కొద్దిదూరం వెళ్లాక ఆ యువకుడు కారు ఆపాడు. ఆ యువకుడు కారు ఆపిన వెంటనే అతడిని కొడుతూ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని జలంధర్ పోలీసు అధికారి సుర్జీత్ సింగ్ తెలిపారు.