
- రోజురోజుకూ ఈ ప్రాబ్లమ్ పెరుగుతోంది
- కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్
- లూథియానాలో ఎన్నికల ప్రచారం
చండీగఢ్: పంజాబ్‌లో డ్రగ్స్ సమస్య ఇంకా ఉన్నదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ఈ ప్రాబ్లమ్ పెరుగుతోందని, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పంజాబ్‌లోని లూథియానా ఎంపీ అభ్యర్థి అమరీందర్‌సింగ్ రాజా వారింగ్ తరఫున డాఖాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో పెట్టిన మహాలక్ష్మి స్కీం, రైతులకు రుణమాఫీ, కనీస మద్దతు ధరలాంటి హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు. డ్రగ్స్ సమస్యపై పంజాబ్ గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆప్, కాంగ్రెస్ ఇండియా కూటమిలోనే ఉన్నా.. పంజాబ్ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి.
రాజ్యాంగం అనేది పేదల గొంతుక
రాజ్యాంగం అనేది ఓ పుస్తకం కాదని, ఇది పేదల గొంతుక అని రాహుల్‌గాంధీ తెలిపారు. ఇప్పటివరకూ దేశ చరిత్రలోనే ఏ పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పలేదంటూ బీజేపీపై పరోక్షంగా ధ్వజమెత్తారు. “రిజర్వేషన్ అయినా.. ప్రభుత్వ ఉద్యోగమైనా.. పేదలకు హక్కులైనా అవి రాజ్యాంగం కల్పించినవే. ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ఫినిష్ చేయాలనుకుంటున్నది” అని ఆరోపించారు.
ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని ప్రధాని మోదీ మాట తప్పారని ధ్వజమెత్తారు. అదానీ, అంబానీకి లాభం చేకూర్చేందుకు నోట్ల రద్దు, జీఎస్టీతో చిన్న, చిన్నమధ్యతరగతి వ్యాపారులను కష్టాల్లోకి నెట్టారని అన్నారు. అగ్నివీర్ స్కీమ్‌తో దేశ జవాన్లను కూడా అవమానించారని ఫైర్ అయ్యారు. జూన్ 4 తర్వాత తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు అగ్నివీర్ స్కీమ్‌ను డస్ట్‌బిన్‌లో పడేస్తామని చెప్పారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు రూ.70 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసిందని గుర్తుచేశారు. ఈ సారికూడా ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రుణమాఫీకి మొదటి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొస్తామని, ప్రస్తుత స్కీమ్ 16 ఇన్సూరెన్స్ కంపెనీలకు మాత్రమే మేలు చేస్తోంది తప్ప రైతులకు కాదని అన్నారు. అన్నదాతలు దేశానికి వెన్నెముక
అని, వారిని కాపాడుకోవాలని అన్నారు.