
పంజాబ్‌లో దశాబ్దాల తర్వాత ఎన్నడూ లేనంతగా భారీ వరదలు సంభవించాయి. ఈ విపత్తును ఎదుర్కోవడానికి పంజాబ్ రాష్ట్రాన్ని విపత్తు ప్రభావిత రాష్ట్రంగా పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. విపత్తు నిర్వహణ చట్టం 2025 ప్రకారం ఏర్పాటైన రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ (SEC) ఛైర్మన్‌గా పంజాబ్ ప్రధాన కార్యదర్శి KAP సిన్హా ఇలాంటి ప్రమాదకరమైన విపత్తు పరిస్థితి ఎదురైనప్పుడు చట్టంలోని సెక్షన్ 34 కింద అవసరమైన అన్ని ఉత్తర్వులను జారీ చేసేందుకు జిల్లా న్యాయాధికారులకు అధికారం ఇచ్చారు.
సహాయక చర్యలు, ప్రభుత్వ ఆదేశాలు: వరద బాధిత ప్రజలకు తక్షణ సహాయం అందించాలని అన్ని జిల్లాల విపత్తు నిర్వహణ అధికారులను (DDMAలు) ప్రభుత్వం కోరింది. అలాగే, అన్ని ప్రభుత్వ విభాగాలు అత్యవసర సహాయక విధులను ఖచ్చితంగా పాటించాలని, సకాలంలో సహాయం అందించాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొబైల్, ల్యాండ్‌లైన్ కనెక్టివిటీని వెంటనే పునరుద్ధరణ చేయాలనీ అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇచ్చారు. పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు సహా అన్ని స్థానిక అధికారులు అత్యవసర సహాయ చర్యలకు పూర్తిగా సహకరించాలి. ప్రధాన కార్యదర్శి తెలిపిన వివరాల ప్రకారం, పంజాబ్‌లో సుమారు 1,200 గ్రామాలు వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి, దీనివల్ల లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
భారీ వర్షాలు, ఆనకట్టల నుండి నీటిని విడుదల చేయడంతో చాల జిల్లాల్లో వరదలు సంభవించాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారిపోవచ్చు. ప్రస్తుతం, దాదాపు 3.75 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు, ముఖ్యంగా వరి పొలాలు, వరద నీటిలో మునిగిపోయాయి. దీనివల్ల పంట కోతకు కొన్ని వారాల ముందే పంట నష్టాలు సంభవించాయి. పశువుల నష్టం కూడా జరిగింది, దింతో పాడి, పశుపోషణపై ఆధారపడిన గ్రామీణ కుటుంబాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భాక్రా ఆనకట్ట వద్ద నీటి మట్టం 1,680 అడుగుల ప్రమాద స్థాయికి దాదాపు 1,678 అడుగులకు చేరుకుంది. పాంగ్ ఆనకట్ట వద్ద నీటి మట్టం 1,393 అడుగులకు చేరుకుంది, ప్రమాద స్థాయి 1,390 అడుగులు. మరోవైపు భారత్ నుండి వరదల హెచ్చరిక నేపథ్యంలో పాకిస్తాన్ పంజాబ్‌లో కూడా 1 లక్ష 50 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో మరింత దిగజారే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.