ప్లే ఆఫ్స్ ముచ్చట తర్వాత.. ముందు మ్యాచ్ గెలవండి: పంజాబ్‏కు మార్క్ బౌచర్ చురకలు

ప్లే ఆఫ్స్ ముచ్చట తర్వాత.. ముందు మ్యాచ్ గెలవండి: పంజాబ్‏కు మార్క్ బౌచర్ చురకలు

లీగ్ ప్రారంభంలో వరుసగా ఆరు విజయాలు.. మ్యాచ్ రద్దుతో ఒక పాయింట్.. మొత్తం 13 పాయింట్లతో టేబుల్ టాపర్ స్థానం.. ఈ సమీకరణాల ప్రకారం ఆ జట్టు ప్లే ఆఫ్స్‎కు చేరడం పెద్ద మ్యాటరే కాదు. ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు ఖాయమైనట్టే. సగటు క్రీడా అభిమానులు, విశ్లేషకులు అందరూ ఇదే అనుకున్నారు. కానీ లీగ్ ముగింపు దశకు వచ్చేవరకు సీన్ రివర్స్ అయ్యింది. వరుసగా ఆరు విజయాలు సాధించిన ఆ జట్టు లీగ్ చివర్లో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమి పాలై ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఇది ఐపీఎల్ 19లో పంజాబ్ కింగ్స్ పరిస్థితి. 

లీగ్ ప్రారంభంలో వరుసగా ఆరు విజయాలతో జైత్రయాత్ర కొనసాగించిన అయ్యర్ సేన.. ఆ తర్వాత వరుసగా ఐదు పరాజయాలు మూటగట్టుకుంది. దీంతో సునాయసంగా ప్లే ఆఫ్స్‎కు చేరాల్సిన ఆ జట్టు ఇప్పుడు టాప్ 4 బెర్త్ కోసం నానా తిప్పలు పడుతోంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్‎కు దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ మార్క్ బౌచర్ కీలక సూచన చేశాడు. 

పంజాబ్ ఆటగాళ్లు మైండ్‎లో నుంచి ప్లే ఆఫ్స్ అనే ఆలోచనను తీసేసి.. మ్యాచ్ గెలవాలనే కసితో ఆడాలని సూచించారు. ప్లే ఆఫ్స్ గురించి ఆలోచించి ఆటగాళ్లు అదనపు ఒత్తిడికి గురి అవుతుండటంతో వరుసగా మ్యాచులు ఓడిపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆటగాళ్లు ప్లే ఆఫ్స్ అనే ఆలోచనను నుంచి బయటికొచ్చి కోల్పోయేదేమి లేదనుకోని ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా మిగిలిన మ్యాచులు ఆడాలని సూచించారు. ఆటలో నిర్భయమైన వైఖరిని అవలంబించడం ద్వారా ఫలితాలు సానుకూలంగా వస్తాయన్నారు. 

ఉంటే ఉంటం.. పోతే పోతం అనే ఫ్రీ మైండ్ సెట్‎తో గేమ్ ఆడాలని చెప్పారు. ఈ సీజన్‌ను వరుస విజయాలతో ఘనంగా ఆరభించిన పంజాబ్ లీగ్ చివర్లో వరుస ఓటములతో క్లిష్ట పరిస్థితిలో పడిందన్నారు. ఆటగాళ్లలో ప్లే ఆఫ్స్ అనే ఆలోచనే వల్లే ఇలా జరుగుతుందన్నారు. ఇకపై ఆడబోయే మ్యాచులు డై ఆర్ డై లాగా ఆడాలని సూచించారు. ప్లే ఆఫ్స్ గురించి అతిగా ఆలోచించి అదనపు ఒత్తిడికి గురి కావొద్దన్నారు.

 ఆటగాళ్లు ప్లే ఆఫ్స్ మనస్తత్వాన్ని వీడాలని సూచించారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడిన పంజాబ్ ఆరు విజయాలు, ఐదు పరాజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో మొత్తం 13 పాయింట్లతో పాయింట్ల  పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచులు తప్పక గెలవాలి.