పంజాబ్ లో రాజీనామా చేసిన మరో మంత్రి

పంజాబ్ లో రాజీనామా చేసిన మరో మంత్రి

అవినీతి ఆరోపణల నేపథ్యంలో పంజాబ్ మంత్రి  ఫౌజా సింగ్ సరారీ తన పదవీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం  భగవంత్ మాన్‌కు పంపించగా సీఎం దీనిని అమోదించారు.  వ్యక్తిగత కారణాల వల్లే తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్లుగా ఫౌజా సింగ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.  

కాంట్రాక్టుల విషయంలో డబ్బుతీసుకోవడం గురించి మంత్రి తన సన్నిహితుడితో మాట్లాడుతున్న ఆడియో క్లిప్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున వచ్చింది.  అయితే  ఆ ఆడియోలో ఉన్నది తన మాటలు కాదని ఫౌజా సింగ్ తోసిపుచ్చారు. ఇక తాను పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. 

పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన పదినెలల్లో ఇద్దురు మంత్రలు అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఫౌజా సింగ్  కంటే ముందు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా ఉన్న విజయ్ సింగ్లాను సీఎం  మాన్‌ తన మంత్రివర్గం నుంచి తొలగించారు. ఆయనపై  కేసు నమోదు చేయాలని మాన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పోలీసులు విజయ్ సింగ్లాను  ఆరెస్ట్ చేశారు. 

ఇక  పంజాబ్ కొత్త మంత్రిగా ఆప్ సీనియర్ నేత డాక్టర్ బల్బీర్ సింగ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఐ సర్జన్ అయిన బల్బీర్  సింగ్ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాటియాలా రూరల్ స్థానం నుంచి  విజయం సాధించారు. కుటుంబ, ఆరోగ్య  సంక్షేమ శాఖ మంత్రిగా ఆయనకు సీఎం బాధ్యతలను అప్పగించారు.