35 ఏండ్ల తర్వాత తల్లిని కలిసిండు..వరద బాధితులకు సాయం కోసం వెళ్లి..

 35 ఏండ్ల తర్వాత తల్లిని కలిసిండు..వరద బాధితులకు సాయం కోసం వెళ్లి..
  • అమ్మమ్మ వాళ్లది అదే ఊరని ఫోన్లో చెప్పిన మేనత్త
  • ఊర్లో అందరినీ అడుగుతూ అమ్మ దగ్గరికి చేరిన యువకుడు

పాటియాలా: వరద బాధితులకు సాయం చేసేందు కు వెళ్లిన ఓ వ్యక్తి.. 35 ఏండ్ల కింద దూరమైన తల్లిని చేరుకున్నాడు. రెస్క్యూ ఆపరేషన్​లో వలంటీర్​గా వెళ్లిన ఊరిలో మొదటిసారి తన తల్లిని చూడగలిగాడు. పంజాబ్​లోని బోహర్​పూర్ గ్రామంలో అనుకోకుండా కలిసిన తల్లీకొడుకుల స్టోరీ ఇది. 

అత్త ఫోన్ కాల్ మలుపు తిప్పింది..  

పంజాబ్​కు చెందిన జగ్జీత్ సింగ్ తాను చంటిబిడ్డగా ఉన్నపుడే తండ్రి చనిపోయాడు. తల్లి రెండో పెండ్లి చేసుకుంది. రెండేండ్ల వయసున్నప్పుడు జగ్జీత్​ను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయిన తాత, నానమ్మ తమ దగ్గరికి తెచ్చుకుని పెంచారు. జగ్జీత్ పెరిగేకొద్దీ తల్లిదండ్రుల గురించి అడిగితే యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పేవాళ్లు. ప్రస్తుతం 37 ఏండ్లున్న జగ్జీత్​సింగ్ ఓ ఎన్జీవో నడుపుతూ, గురుద్వారాలో ఆధ్యాత్మిక గాయకుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవలి వర్షాలు పాటియాలాను ముంచెత్తడంతో జగ్జీత్ తన ఎన్జీవో సభ్యులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్​కు వెళ్లాడు. అక్కడ సహాయ చర్యలు చేపడుతుండగా జగ్జీత్​కు అతడి అత్త ఫోన్ చేశారు. అమ్మమ్మ కుటుంబం అక్కడే బోహర్​పూర్​లో ఉండేదని చెప్పడంతో జగ్జీత్ సెర్చింగ్ మొదలు పెట్టాడు. ఫైనల్​గా అమ్మమ్మ అడ్రస్ కనుక్కుని వెళ్లాడు. మొదట్లో అనుమానించిన ఆమె, చివరకు తన బిడ్డకు మొదటి పెండ్లి ద్వారా ఓ కొడుకు పుట్టాడని, అతనిప్పుడు ఎక్కడున్నాడో తెలియదని చెప్పింది. దీంతో జగ్జీత్ కన్నీళ్లు పెట్టుకుంటూ అది తానే అని చెప్పుకున్నాడు. ఆపై తన తల్లి హర్జీత్​ను చూసిన సంతోషంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఐదేండ్ల కింద తన తల్లి బతికే ఉందని జగ్జీత్​కు తెలిసేనాటికే తన తాత, నానమ్మ కూడా చనిపోయారు. దీంతో తల్లి వివరాలు తెలుసుకోలేకపోయాడు. ప్రస్తుతం జగ్జీత్​కు భార్య, 14 ఏండ్ల బిడ్డ, 8 ఏండ్ల కొడుకు ఉన్నారు. ఎట్టకేలకు తల్లిని కలుసుకున్నానని జగ్జీత్ ఫేస్​బుక్​లో వెల్లడించాడు.