అమృత్ పాల్ కు ఆశ్రయమిచ్చిన మరో మహిళ అరెస్టు

అమృత్ పాల్ కు ఆశ్రయమిచ్చిన మరో మహిళ అరెస్టు

సిక్కుల అత్యున్నత సంస్థ అకాల్ తఖ్త్ పిలుపు 

చండీగఢ్: పరారీలో ఉన్న ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ లొంగిపోవాలని సిక్కుల అత్యున్నత సంస్థ అకాల్ తఖ్త్ పిలుపునిచ్చింది. శనివారం అకాల్ తఖ్త్ జత్యేదార్ జ్ఞాని హర్ ప్రీత్ సింగ్ వీడియో మెసేజ్ విడుదల చేశారు. అమృత్ పాల్ పోలీసుల ఎదుట లొంగిపోయి, విచారణకు సహకరించాలని ఆయన సూచించారు. ‘‘పోలీసులు ఇంతవరకు అమృత్ పాల్ ను అరెస్టు చేయలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంతమంది పోలీసులు ఉండి ఏం చేస్తున్నారు? వాళ్ల పనితీరుపై సందేహంగా ఉంది. ఒకవేళ పోలీసులు ఇప్పటికే అమృత్ పాల్ ను అరెస్టు చేసి ఉంటే, ఆ విషయాన్ని ధ్రువీకరించాలి. నిజంగానే అమృత్ పాల్ పరారీలో ఉంటే పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోరుతున్నాను” అని చెప్పారు. పంజాబ్ లో పరిస్థితిపై చర్చించేందుకు దాదాపు 70 సిక్కు సంస్థలతో సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, ఈ నెల 18 నుంచి అమృత్ పాల్ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే తమ కొడుకును పోలీసులే అరెస్టు చేశారని అమృత్ పాల్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

మరో మహిళ అరెస్టు.. 

అమృత్ పాల్ కు ఆశ్రయమిచ్చిన మరో మహిళను పంజాబ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అమృత్ పాల్, ఆయన అనుచరుడు పాపల్ సింగ్ హర్యానాలోని కురుక్షేత్రకు వెళ్లేముందు పాటియాలాలో ఆగారని.. వాళ్లకు ఈ నెల 19న బల్బీర్ కౌర్ అనే మహిళ షెల్టర్ ఇచ్చిందని పోలీసులు తెలిపారు. అందుకే ఆమెను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కాగా, ఇంతకుముందు కురుక్షేత్రలో అమృత్ పాల్ కు ఆశ్రయమిచ్చిన బల్జీత్ కౌర్ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు.