అమృత్​పాల్ కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల వేట

అమృత్​పాల్ కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల వేట

చండీగఢ్​: ‘వారిస్  పంజాబ్  దే’ చీఫ్​ అమృత్ పాల్ సింగ్  పోలీసులకు దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు. శనివారం అమృత్​సర్  జిల్లా జల్లూపూర్ కు వెళ్తున్నాడని తెలిసి పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. స్పెషల్  టీం ఏర్పాటు చేసి, 50  వాహనాలలో పోలీసులు అమృత్  కారును 25 కిలోమీటర్ల వరకు వెంటాడారు. ఈ క్రమంలోనే అమృత్​పాల్​ను అరెస్టు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, జలంధర్​ పోలీస్ కమిషనర్​ కుల్దీప్  సింగ్ చాహల్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అర్ధరాత్రి వరకూ అమృత్​పాల్​ వాహనాన్ని పోలీసులు వెంటాడారని, ఇరుకు గల్లీల్లో అతను తప్పించుకున్నాడని చెప్పారు.

రెండు వాహనాలు స్వాధీనం..

అమృత్​ను త్వరలోనే అరెస్టు చేస్తామని కమిషనర్  చెప్పారు. ‘‘అమృత్  ఇంకా పరారీలోనే ఉన్నాడు. శనివారం అతని వాహనాన్ని చేజ్ చేస్తుండగా, అతను మరో వాహనంలోకి మారాడు. మధ్యలో ఇరుకైన రోడ్లు, గల్లీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అతను తప్పించుకున్నాడు. అతను ప్రయాణించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నాం” అని కమిషనర్ చెప్పారు. ఇక జలంధర్​లో రాపిడ్ యాక్షన్  ఫోర్స్​తో మార్చ్  నిర్వహించామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

పంజాబ్​  అంతటా గాలింపు చర్యలు

పరారీలో ఉన్న అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కార్డన్ అండ్  సెర్చ్  ఆపరేషన్  చేపట్టారు. అమృత్ తో పాటు అతని మద్దతుదారుల కోసమూ గాలిస్తున్నారు.

పోలీసుల ఆధీనంలో ఉన్నడు..అమృత్​ పాల్​ తండ్రి

నా కొడుకు పోలీసుల ఆధీనంలోనే ఉన్నడు

తన కొడుకు అమృత్ పాల్ ను పోలీసులు అరెస్టు చేశారని, అతడు వారి ఆధీనంలోనే ఉన్నాడని అమృత్  తండ్రి తార్సెం సింగ్  పేర్కొన్నారు. తన కొడుకు అరెస్టు గురించి పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘‘శనివారం నుంచి అమృత్ ఆచూకీ తెలియట్లే. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమృత్  ఇంకా వారి వద్దే ఉన్నాడు” అని తార్సెం చెప్పారు. కాగా, అమృత్ పాల్ కోసం వేట కొనసాగుతున్న నేపథ్యంలో జల్లూపూర్​లో భద్రతా బలగాలను మోహరించారు.