ప్రభుత్వ టీచర్లకు సింగపూర్లో శిక్షణ

ప్రభుత్వ టీచర్లకు సింగపూర్లో శిక్షణ

విదేశాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే పథకం అమలుకు పంజాబ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద పాఠశాల విద్యా శాఖ 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగపూర్‌లోని ప్రిన్సిపాల్స్ అకాడమీకి 36 మంది ప్రిన్సిపాల్‌లను సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీకి చెందిన స్వయంప్రతిపత్త సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు 30 మంది ప్రిన్సిపాల్‌లను పంపనున్నట్టు అధికారిక ప్రకటనలో తెలిపింది.  ఈ శిక్షణలో వారికి అత్యాధునిక బోధనా పద్ధతులు, నాయకత్వ నైపుణ్యాలు, బోధన-అభ్యాస సామాగ్రి, ఆడియో-విజువల్ టెక్నాలజీని రూపొందించడం వంటివి నేర్పిస్తారని పేర్కొంది.

దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అక్కడి ప్రభుత్వం ఆప్ చేసినట్టు తెలుస్తోంది. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువస్తామని ఇంతకు మునుపే పంజాబ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగానే పాఠశాలల్లో విద్య నాణ్యతను మెరుగుపరచటానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులను సింగపూర్‌కు పంపి శిక్షణ ఇస్తున్నామని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ప్రకటించారు. ఈ శిక్షణ కోసం మొదటి బ్యాచ్ లో 36మంది ప్రిన్సిపాల్స్ ఫిబ్రవరి 4న సింగపూర్ వెళ్లనున్నారని తెలిపారు. వీరు వృత్తిపరమైన శిక్షణ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 11న తిరిగి వస్తారని స్పష్టం చేశారు.