
- ఇయ్యాల్టి నుంచి వడ్ల కొనుగోళ్లు
- 7100 సెంటర్ల ద్వారా యాసంగి ధాన్యం సేకరణ: హరీశ్, గంగుల, సింగిరెడ్డి
- పెండింగ్ సీఎంఆర్ ఈ నెల 30లోగా ఇవ్వాలె
- పాత బియ్యం అప్పగిస్తేనే కొత్త వడ్లు మిల్లింగ్‌కు ఇస్తం
- వడ్ల సేకరణపై అధికారులతో మంత్రుల సమీక్ష
హైదరాబాద్, వెలుగు: యాసంగి వడ్ల కొనుగోళ్లను మంగళవారం నుంచి ప్రారంభించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 7100 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సోమవారం హైదరాబాద్ బీఆర్‌కే భవన్‌లో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లకు కావాల్సిన ఏర్పాట్లను కలెక్టర్లు రెడీ చేసుకోవాలని చెప్పారు. అడిషనల్ కలెక్టర్లు దీనిపై ఒక యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లాలని ఆదేశించారు. ధాన్యం నిల్వ చేసేందుకు ఇంటర్మీడియట్ కాలేజీలను గోడౌన్లుగా గుర్తించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు.
స్టేట్ బోర్డర్‌లలో చెక్ పోస్టులు
సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా స్టేట్ బోర్డర్‌లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రులు సూచించారు. అమ్మిన వడ్ల డబ్బులు రైతులకు చెల్లించడంలో లేటు కాకుండా కొనుగోలు వివరాలను ఎప్పటికప్పడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు. మిల్లర్లు ఇక నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను అప్పగించే విషయంలో ఏమాత్రం లేటు చేసినా ఉపేక్షించబోమని మంత్రులు హెచ్చరించారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సీఎంఆర్‌ను ఈ నెల 30లోగా అప్పగించి ఈ యాసంగి సీజన్ సంబంధించి ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లుకు సూచించారు. ఇప్పటి వరకు సీఎంఆర్ లో పాల్గొనని మిల్లర్లకు ఈ యాసంగి సీజన్ నుంచి అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
యాసంగి ధాన్యం సాగులో తెలంగాణ టాప్
ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు వల్ల దేశంలో సగం పంట తెలంగాణలో సాగైందని మంత్రులు అన్నారు. పండించిన మొత్తం ధాన్యాన్ని రెండు సీజన్లలో పూర్తి స్థాయిలో కొంటున్న ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు. 2014–-15 లో రూ.3392 కోట్లతో వడ్లు కొనుగోలుచేయగా 2020-–21 నాటికి రూ.26,600 కోట్లకు చేరుకుందన్నారు. ఈ 9 ఏండ్లలో ఆరురెట్లు ధాన్యం కొనుగోలు పెరగగా మిల్లింగ్ సామర్థ్యం రెండు రెట్లు మాత్రమే పెరిగింన్నారు. సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, సివిల్ సప్లయ్స్ చైర్మన్ రవీందర్ సింగ్, అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు, సివిల్ సప్లయ్స్ కమిషనర్ అనీల్ కుమార్, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.