బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి: పురుషోత్తం రూపాల

బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి: పురుషోత్తం రూపాల
  • బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి
  • రాష్ట్రానికి లక్షల కోట్ల నిధులిచ్చినం: కేంద్ర మంత్రి రూపాల 
  • పశువుల పెంపకందారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తాం
  • చెన్నూరులో బీజేపీ బహిరంగ సభ

మంచిర్యాల, వెలుగు: ప్రధాని మోడీ నాయకత్వంలోనే దేశంలో అభివృద్ధి, అవినీతి రహిత పాలన సాధ్యమని కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. తెలంగాణలోనూ అభివృద్ధి జరగాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన బహిరంగ సభకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామితో కలిసి రూపాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు లక్షల కోట్ల నిధులు మంజూరు చేసిందని చెప్పారు. 

చెన్నూరులోని ఉత్తర వాహిని గోదావరి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ‘‘దేశంలో పశుసంపదను పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటున్నం. అందులో భాగంగా 4 వేల అంబులెన్స్​లు మంజూరు చేసినం. అంబులెన్స్​ల నిర్వహణకు కేంద్రమే 60 శాతం నిధులు మంజూరు చేస్తున్నది” అని తెలిపారు. రైతులకు ఇచ్చినట్టే పశువుల పెంపకందారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తామని చెప్పారు. ‘‘కరోనా కాలంలో మోదీ ప్రజలందరినీ ఒక్కతాటి పైకి తెచ్చారు. అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్లు అందించారు. రైతులకు రూ.18 లక్షల కోట్ల లోన్లు ఇస్తున్నారు. దేశంలో ఆగిపోయిన డ్యాముల నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు” అని అన్నారు.

ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్లు దోచుకున్నరు: వివేక్ వెంకటస్వామి

తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ రాక్షస పాలన పోయి.. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని వివేక్ వెంకటస్వామి అన్నారు. సభకు హాజరైన జనాన్ని చూస్తే.. చెన్నూరు ప్రజలు బీఆర్ఎస్ ఖేల్ ఖతం అని కేసీఆర్​కు మెసేజ్ పంపించినట్లు ఉందన్నారు. ‘‘తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. ఉద్యమ సమయంలో తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని చెప్పి.. అధికారంలోకి రాగానే అన్ని పదవులను తన కుటుంబసభ్యులకు ఇచ్చారు. ఆరు లక్షల కోట్ల అప్పులు చేసి మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్లకు పైగా దోచుకున్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్​లు ఇవ్వలేదు గానీ ఆయన మాత్రం వంద రూమ్​లతో ప్రగతిభవన్ కట్టుకున్నారు. కొడుకు, బిడ్డ, అల్లుడికి వందల ఎకరాల్లో ఫామ్ హౌస్​లు కట్టించారు” అని మండిపడ్డారు. 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రెండున్నర లక్షల ఇండ్లు మంజూరు చేస్తే, కేసీఆర్ ఒక్కటి కూడా కట్టించలేదని ఫైర్ అయ్యారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి తదితర హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధు, బీసీలకు ఆర్థిక సాయం కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని.. అందులోనూ ఎమ్మెల్యేలు 30% కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని, ఆయుష్మాన్ భారత్ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని, ఫసల్ బీమా స్కీమ్ అమలు చేస్తామని హామీఇచ్చారు.