డిసెంబర్ 8న రష్యాలో 'పుష్ప' రిలీజ్

డిసెంబర్ 8న రష్యాలో 'పుష్ప' రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' మూవీ సూపర్ హిట్ అయ్యింది. అలాంటి ఈ సినిమాను ఇప్పుడు రష్యన్ భాషలోకి డబ్ చేశారు. రష్యాలో డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రష్యన్ వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ చిత్రంలోని ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ను బట్టి చూస్తే, డబ్బింగ్ విషయంలో సీరియస్ గానే శ్రద్ధ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయా పాత్రల మేనరిజమ్స్ రష్యన్ భాషలోనూ బాగానే వర్కౌట్ అయినట్టుగా ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. రిలీజ్ కి ముందు రష్యాలోని ముఖ్యమైన నగరాల్లో ప్రీమియర్స్ ను ప్రదర్శించనున్నారు. మరి రష్యన్లను ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమా.. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కొత్త రికార్డును నమోదు చేసింది. తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లో విడుదలైన పుష్ప సినిమా.. వసూళ్ల పరంగా దూసుకుపోయింది.