వ్యూహం మార్చిన పుతిన్.. ఫస్ట్ ఫేజ్ యుద్ధం ముగిసిందని ప్రకటన

వ్యూహం మార్చిన పుతిన్.. ఫస్ట్ ఫేజ్ యుద్ధం ముగిసిందని ప్రకటన
  • వ్యూహం మార్చిన పుతిన్ సేనలు 
  • ఫస్ట్ ఫేజ్ యుద్ధం ముగిసిందని రష్యా ప్రకటన 
  • రష్యన్లను దీటుగా ఎదుర్కొంటున్నామన్న ఉక్రెయిన్ 
  • ఎదురుదెబ్బల వల్లే రష్యా వ్యూహం మార్చిందని అంచనా


కీవ్/మాస్కో: ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఇతర సిటీలపై నెల రోజులుగా బాంబుల వర్షం కురిపించిన రష్యా తాజాగా తన స్ట్రాటజీని మార్చుకుంది. ఇకపై తూర్పున, తమ దేశానికి సరిహద్దులో ఉన్న డాన్ బాస్ రీజియన్ పైనే ప్రధానంగా ఫోకస్ పెడుతున్నామని రష్యన్ ఆర్మీ అధికారులు ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్ లో మొదటి విడత యుద్ధం ముగిసిందని, యుద్ధంలో కొత్త ఫేజ్ మొదలైందని వెల్లడించారు. ఫస్ట్ ఫేజ్ యుద్ధంలో తమ బలగాలు ప్రధాన లక్ష్యాలను సాధించాయని రష్యన్ జనరల్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ అన్నారు. అయితే, రష్యా స్ట్రాటజీ మార్చుకోవడాన్ని చూస్తే.. ముందుగా అనుకున్న యుద్ధ వ్యూహంలో ఫెయిల్ అయినట్లే కనిపిస్తోందని పశ్చిమ దేశాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు రష్యన్లకు ఉక్రెయిన్​లో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయని, భారీగా నష్టపోయారని ఉక్రెయిన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ సోయిగు గుండెపోటుతో అనారోగ్యం పాలయ్యారని చెప్పారు. కీవ్​పై రష్యన్ బలగాల దాడులను దీటుగా తిప్పికొడుతున్నామని తెలిపారు. యుద్ధంలో ఎక్విప్ మెంట్లు సరిగా పని చేయకపోవడం వల్ల కూడా రష్యా ఎదురు దెబ్బలు తింటోందన్నారు. అందుకే రష్యన్లు తమ ఫోకస్ ను కీవ్ పై నుంచి డాన్​బాస్​కు మార్చారని పేర్కొన్నారు. డాన్ బాస్ రీజియన్​లో 2014 నుంచి రెబెల్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడ రెబెల్స్​కు రష్యా అండదండలు ఉన్నాయి.

రష్యన్ల నిర్బంధంలో చెర్నిహివ్   

ఉక్రెయిన్​లోని దక్షిణాన ఉన్న మరియుపోల్ సిటీని నాశనం చేసినట్లుగానే... ఉత్తరాన ఉన్న చెర్నిహివ్ నగరాన్ని కూడా రష్యన్ బలగాలు చుట్టుముట్టి, నిరంతరం బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో సిటీలో చిక్కుకున్న ప్రజలు తిండి, నీళ్లు, మందులు, కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెర్నిహివ్ మరో మరియుపోల్ సిటీలా మారుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెర్నిహివ్ నుంచి కీవ్ వెళ్లే బ్రిడ్జిని ఇదివరకే రష్యన్లు ధ్వంసం చేశారు. దీంతో నగరానికి తిండి, నీళ్లు, మందుల సరఫరా బంద్ అయింది. ఇప్పటివరకు సిటీలో దాదాపు సగం మంది (2.80 లక్షలు) ప్రజలు వెళ్లిపోయారని అధికారులు వెల్లడించారు.

ప్రపంచ దేశాలు మద్దతివ్వాలె: దోహా వేదికపై జెలెన్​స్కీ​

ఉక్రెయిన్​లో రష్యా విధ్వంసానికి పాల్పడుతోందని, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలన్నీ తమకు మద్దతు ఇవ్వాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ కోరారు. రష్యాకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడం కోసం వరుసగా వివిధ దేశాల పార్లమెంట్ లను ఉద్దేశించి వర్చువల్​గా మాట్లాడుతున్న ఆయన.. శనివారం ఖతార్ లో జరిగిన ‘దోహా ఫోరమ్’ సదస్సుకూ వీడియో సందేశం పంపారు. సిరియా యుద్ధంలో అలెప్పో సిటీని నాశనం చేసినట్లే.. తమ దేశంలోని మరియుపోల్ సిటీని, పోర్టులను రష్యా ధ్వంసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై అణుబాంబులు ప్రయోగిస్తామని రష్యా బెదిరిస్తోందని, అదే జరిగితే మొత్తం ప్రపంచానికే ముప్పు తప్పదని హెచ్చరించారు. ఉక్రెయిన్ నుంచి గోధుమలు, ఇతర సరుకుల ఎగుమతులు ఆగిపోయి మిడిల్ ఈస్ట్ లోని ఈజిప్ట్, ఇతర దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. రష్యా నుంచి చమురు, గ్యాస్ ఎగుమతులపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయని, ఖతార్ సహా మిగతా దేశాలన్నీ చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని కోరారు.